బీజేపీని పవన్ వదులుకున్నట్లేనా....!?

ఏపీలో అటు బీజేపీ ఇటు టీడీపీలలో ఎవరితో వెళ్లాలి అన్న సందేహం వచ్చినపుడు జనసేన అధినేత కచ్చితంగా టీడీపీనే ఎంచుకోవాలని అనుకున్నారు.

Update: 2023-12-21 15:30 GMT

ఏపీలో అటు బీజేపీ ఇటు టీడీపీలలో ఎవరితో వెళ్లాలి అన్న సందేహం వచ్చినపుడు జనసేన అధినేత కచ్చితంగా టీడీపీనే ఎంచుకోవాలని అనుకున్నారు. అదే ఆయన ఆచరణలో చేసి చూపించారు. నిజానికి 2022 మార్చి 14న ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ నాటికే పవన్ బీజేపీ కోసమే ఒక బహిరంగ అప్పీల్ ని చేశారు. అప్పటికే ఆయన టీడీపీ మైత్రిని ఆకాంక్షిస్తున్నట్లుగా ఆయన చేసిన ప్రకటనల బట్టి అర్ధం అయింది.

బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే చాలు ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ముందుకు సాగుతామని కూడా పవన్ చెప్పారు. అయితే ఆనాటి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే తమ రోడ్ మ్యాప్ ఏంటో పవన్ కి ఎపుడో ఇచ్చేశామని వెల్లడించారు. అంటే ఏపీలో థర్డ్ ఫోర్స్ గా ముందుకు రావాలని బీజేపీ ఆలోచనలు పవన్ కి చెప్పామని సోము వీర్రాజు నాడు ఇండైరెక్ట్ గా చెప్పారన్న మాట.

అయితే మరో రెండేళ్ళ కాలం గడచింది. ఈలోగా ఏడాదిగా టీడీపీ జనసేన సన్నిహితం అయ్యాయి. అది ఎంతవరకూ వచ్చిందంటే చంద్రబాబు జైలులో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ ఆయన్ని పరామర్శించి జైలు బయట పొత్తు ప్రకటన చేసారు. దాంతో ఈ బంధం ఇంకా గట్టిపడింది. ఇక దానికి మరో కీలక మలుపు అన్నట్లుగా తాజాగా విజయనగరం జిల్లా భోగాపురం వద్ద జరిగిన యువగళం ముగింపు సభలో పవన్ చేసిన కామెంట్స్.

ఆయన ఆ సభకు వెళ్లడం ద్వారానే టీడీపీతో కలసి అడుగులు మరింత దూకుడుగా ముందుకు వేయనున్నట్లుగా ప్రకటించినట్లు అయింది. ఇక ఈ సభలో పవన్ మాట్లాడుతూ ఏపీలో టీడీపీ జనసేన కూటమిలోకి రావాలని తాను స్వయంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద అమిత్ షాతో మాట్లాడినట్లుగా చెప్పారు. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రోడ్ల మీద కొట్లాటలే తప్ప మరేమీ ఉండవని కూడా చెప్పాను అని పవన్ వివరించే ప్రయత్నం చేశారు.

తాను చెప్పాల్సింది చెప్పాను ఇక మిగిలింది బీజేపీ వారి దయ ప్రాప్తం అన్నట్లుగా పవన్ యువగళం సభలో మాట్లాడారు. పైగా ఆయన తమ కూటమికి బీజేపీ పెద్దల ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. అయితే పవన్ తానుగా ఒక నిర్ణయం తీసుకుని ఇపుడు ఏపీలో కొటమి విషయంలో బీజేపీని కలసిరావాలని కోరడం పట్లనే కమలం పార్టీలో మధనం సాగుతోంది అంటున్నారు.

బీజేపీ దేశాన్ని ఏలీ పార్టీ. పెద్ద పార్టీ, జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి ఆప్షన్లు ఇపుడు ఇవ్వడం పట్ల కూడా చర్చ సాగుతోంది. ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక వ్యూహంతో బీజేపీ ఉంది. ఏపీలో వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి మిత్రులుగానే ఉండాలన్నది ఆ పార్టీ ఆలోచన. వీలైనంతవరకూ రాజకీయ లబ్ది ఏపీ నుంచి పొందాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో జనసేనతో 2020 జనవరిలో బీజేపీ పొత్తు పెట్టుకుంది ఈ రెండు పార్టీలు కలసి మూడవ శక్తిగా 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని ఆనాడు నిర్ణయించుకున్నాయి. అయితే టీడీపీతో పవన్ పొత్తు కలిపారు. ఒక వేళ జనసేనకు ఆ ఆలోచన ఉన్న బీజేపీ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళి ఉంటే ఇద్దరికీ లబ్ది కలిగేది అన్నది బీజేపీ వ్యూహకర్తల మాట.

టీడీపీకి ఎటూ పొత్తు అవసరం ఉందని అందువల్ల వీలైనంత ఎక్కువగా సీట్లు డిమాండ్ చేయడమే కాకుండా సీఎం సీటు కూడా షేరింగ్ లో కోరే విధంగా ఒప్పందం ఉంటే బాగుండేది అన్నది బీజేపీ ఆలోచనగా ఉందని ప్రచారంలో ఉంది. ఇపుడు పవన్ తానుగా టీడీపీతో పొత్తును ఖరారు చేసుకుని ముందుకు వెళ్లారు. బీజేపీ ఎన్డీయేలో మిత్రుడిగా పవన్ని పిలిచి సమాదరించినా ఆయన టీడీపీనే చివరికి ఎంచుకున్నారు అని అంటున్నారు.

దాంతో బీజేపీ న్యూట్రల్ గా ఉంటుందా లేక కూటమితో కలుస్తుందా అన్నది ఇపుడు పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే బీజేపీ ఏమి చేసినా ఇక ఆ పార్టీదే ఆప్షన్ అన్నట్లుగానే జనసేన వైఖరి ఉంది అంటున్నారు. దాంతో బీజేపీ మీద జనసేన ఆశలు వదులుకుందా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది.

Tags:    

Similar News