2019లో ఓడిపోతానని ముందే తెలుసు-పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏదైనా సమావేశం నిర్వహించాడంటే చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటాడు

Update: 2024-03-14 14:36 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏదైనా సమావేశం నిర్వహించాడంటే చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటాడు. అది కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా తయారవుతుంటుంది. కానీ పవన్ తన తీరు మార్చుకోడు. గురువారం కూడా పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పవన్ అలాగే మాట్లాడాడు. ఈ కార్యక్రమంలోనే తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన పవన్.. 2019లో తాను రెండు చోట్ల ఓడిపోవడం గురించి.. అలాగే ఈసారి పొత్తు వల్ల తనకు, పార్టీకి జరిగిన నష్టం గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడాడు.

2019లో పార్టీ నేతలు, కార్యకర్తల ఒత్తిడి వల్ల తాను రెండు చోట్ల పోటీ చేశానని.. గాజువాక, భీమవరం స్థానాలను ఎంచుకున్నానని.. ఐతే ఈ రెండు చోట్లా ఓటమి సంకేతాలు తనకు ముందే కనిపించాయని పవన్ తెలిపాడు. ఒక నాయకుడికి ప్రచారం చేస్తున్నపుడే జనం ఓట్లు వేస్తారా లేదా అన్నది తెలుస్తుందని.. గాజువాకలో ప్రచారం అవ్వగానే తాను అక్కడ ఓడిపోతున్నానని అర్థమైందని పవన్ తెలిపాడు. గాజువాకలో ఓటమి అన్నది ముందే డిసైడ్ అయిపోయిందని కూడా పవన్ వ్యాఖ్యానించాడు. ఈ ఓటములకు తోడు డబ్బులు లేక పార్టీని నడపడంలో ఇబ్బందులు తలెత్తాయని.. అప్పుడు తనలో అంతర్మథనం మొదలైందని పవన్ తెలిపాడు. ఇండియా వైడ్ సినిమాలు చేయగలిగి ఉండి, ఇంత ఫాలోయింగ్ ఉండి.. సమాజం, రాజకీయాల మీద ఇంత పిచ్చి అవసరమా అన్న ప్రశ్న తలెత్తిందని.. కానీ మనం చేయాల్సింది చేయాలి, ఫలితం గురించి ఆలోచించకూడదు అనే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకుని రాజకీయాల్లో కొనసాగానని పవన్ తెలిపాడు.

ఇక పొత్తు కారణంగా జనసేనకు జరిగిన నష్టం గురించి పవన్ వివరిస్తూ.. మధ్యవర్తిత్వం వల్ల తనకు, పార్టీకి ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం అని.. కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని పవన్ తెలిపాడు. మన పెద్ద మనిషిలా వ్యవహరిస్తే వేరే వాళ్ల దగ్గర చిన్న అవుతామనే పాఠాన్ని నేర్చుకున్నట్లు పవన్ తెలిపాడు. ఐతే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఈసారి కొన్ని త్యాగాలు తప్పవని జనసేనాని పేర్కొన్నాడు.

Tags:    

Similar News