ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పుకున్న పవన్... అనంతరం ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా ముఖ్యమంత్రి పదవిపై స్టేట్ మెంట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీడీపీ-జనసేన పొత్తు తాను తాజాగా తీసుకున్న నిర్ణయం అని చెప్పారు!
అవును... 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం జగన్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ పాలన బాగుంటే తాను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటానని, అలా కానిపక్షంలో పోరాటాలు తప్పవని అప్పట్లో పవన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ తర్వాత కాలంలో సినిమాలు చేసుకున్నారు. అయితే తనకు ఫ్యాక్టరీలు లేవు కాబట్టి తప్పడం లేదని అన్నారు.
అనంతరం ఏపీలో అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్. ఈ సమయంలో తనకు ఇబ్బంది వచ్చినప్పుడు చంద్రబాబు పుష్కగుచ్చంతో వచ్చి ఓదార్చడం.. చంద్రబాబుకు ఇబ్బంది వచ్చినప్పుడు పవన్ సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరుగుతూనే ఉన్నాయి.
ఈ సమయంలో వారాహియాత్రలో భాగంగా సీఎం అయ్యేందుకు సిద్ధం అని ఒకసారి.. తన కార్యకర్తల సంతోషం కోసం అలా చెప్పాను కానీ దానికి చాలా అనుభవం కావాలని ఒకసారి పవన్ స్పందించారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం చీలనిచ్చే ప్రసక్తే లేదని నొక్కి వక్కానించారు. దీంతో... జనసేన, టీడీపీ కలిసే పోటీ చేయబోతున్నాయనే చర్చలో రాజకీయవర్గాల్లోనూ, జనసేన - టీడీపీ కార్యకర్తల్లోనూ తీవ్రంగా చర్చనీయాంశం అయ్యాయి.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు ములాకత్ లో భాగంగా కలిశారు. పవన్ తో పాటు బాలకృష్ణ, లోకేష్ లు వెంట వెల్లగా సుమారు 40 నిమిషాలపాటు ఈ ములాకత్ జరిగింది. అనంతరం పవన్ మీడియా ముందు స్పందించారు.
ఈ క్రమంలో తాను ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్నానని, బీజేపీతో కలిసే ఉన్నానని చెప్పిన పవన్... తనకు టీడీపీతో కలిసి వెళ్లాలనే ఆలోచన ఇంతవరకూ లేదని, జగన్ పాలన చూసిన తర్వాత, చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిందని... ఈ పొత్తుకు జగనే కారణం అన్నట్లుగా పవన్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
"తెలుగుదేశం నేతలతో కలుస్తున్నానంటే అది పాలకపక్షం వల్లే. ఒక వైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్ ల మధ్య ఉన్నానంటే అది పాలకపక్షం వల్లే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును చట్టవ్యతిరేకంగా జైల్లో పెట్టారు. చంద్రబాబుకు నా మద్ధతు ప్రకటిస్తున్నా. రేపే ఎన్నికలు జరిగినా కూడా టీడీపీ - జనసేన కలిసే పోటీచేస్తాయి" అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఇందులో భాగంగానే... "వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తున్నాం. టీడీపీ జనసేన కలిసే పోటీ చేయబోతున్నాయి. ఈ విషయం జనసేన కార్యవర్గం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని నేను ఇవ్వాళ నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది" అని పవన్ స్పష్టం చేశారు.
అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ... చంద్రబాబుతో కలిసి పోటీచేయాలని ఇవాళే అనుకున్నానని, చంద్రబాబు అరెస్ట్ అవ్వడం వల్లే అనుకున్నానన్నట్లుగా పవన్ వ్యాఖ్యానించడంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిప్రాయాలు, కష్టాలు కలిసినప్పుడు కలిసి పోటీచేయడంలో తప్పులేదు కానీ... అది జగన్ వల్లే అని చెప్పడం వెనుక బీజేపీ కి పరోక్షంగా సామాధానం చెప్పే ప్రయత్నమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న కొంతమంది జనసేన నాయకులు, జనసైనికులను ఒప్పించడానికి, ఒక బలమైన కారణం చెప్పడానికి పవన్ ఈ ఎత్తుగడ వేసి ఉంటారనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా... 2024లో టీడీపీ - జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని మాత్రం పవన్ కుండ్దబద్దలు కొట్టి మరీ స్పష్టంగా చెప్పారు.