అంబానీ పెళ్లిలోనూ అంతా అదే అడిగారు.. పవన్‌ హాట్‌ కామెంట్స్‌!

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం తన శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు

Update: 2024-07-15 10:41 GMT

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం తన శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్‌ లో ఆయన కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శాఖలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్న పవన్‌ అధికారులకు సమస్యల పరిష్కారంపై ఆదేశాలు జారీ చేశారు.

కాగా ఇటీవల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్‌ రేటు సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల్లోనూ జనసేన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇటీవల ఎన్నికయిన ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ కు పవన్‌ కల్యాణ్‌ ఘన సన్మానం చేశారు. శాలువాలు కప్పి వారికి కూరగాయల బొకేలు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. దేశంలో తాను ఎక్కడికి వెళ్లినా జనసేన పార్టీ గెలుపు గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. 100 శాతం స్ట్రైక్‌ రేటు ఎలా సాధ్యమైందో చెప్పాలని కోరుతున్నారన్నారు. అంబానీ కుమారుడి పెళ్లికి వెళ్తే అక్కడ కూడా జనసేన గెలుపు గురించే అంతా తనను అడిగారని వివరించారు.

జనసేన విజయం ఇప్పుడు దేశమంతా ఒక కేస్‌ స్టడీ అని తెలిపారు. ఆయా మేనేజ్మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ లకు కూడా ఇది ఒక కేస్‌ స్టడీ అయ్యిందన్నారు.

ఇంతటి ఘనవిజయానికి కారకులైన జనసైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, ప్రజలకు పవన్‌ కళ్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో పొంగిపోవద్దని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ జనసేన పార్టీ కార్యాలయంలో నెలలో ఒకరోజు అందుబాటులో ఉండాలన్నారు. మీ నియోజకవర్గాల సమస్యలను తెలుసుకోవాలన్నారు. అలాగే పార్టీ నాయకులు రాష్ట్రమంతా జనవాణి కార్యక్రమాలు నిర్వహించాలని పవన్‌ కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించాలని కోరారు.

కూటమి విజయానికి జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిని అవుతానని అనుకోలేదని.. ప్రధాని మోదీ హృదయంలో తనకు ప్రత్యేక స్థానముందన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఆయనను తప్పకుండా కలుస్తానని.. కావాల్సినవి అడుగుతానని చెప్పారు.

వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదని ప్రత్యర్థులు మాత్రమేనన్నారు. వారిని దూషించడం, సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం, గొడవలు పడటం చేయొద్దని పవన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో వైసీపీ వాళ్లు చేసిందే మనమూ చేస్తే వాళ్లకు, మనకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు. వైసీపీ నేతల తప్పులకు చట్ట ప్రకారమే శిక్షిద్దామన్నారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు.

అలాగే అధికారులతో కూడా ఎవరూ తప్పుగా ప్రవర్తించొద్దని, బెదిరించొద్దని పవన్‌ సూచించారు. అధికారులతో సమావేశాల్లోనూ కుటుంబ సభ్యులు పెత్తనం చేయకుండా చూసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా కొందరు పార్టీ నేతలకు కూడా పవన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కొందరు నేతలు సొంత పార్టీ నేతల గురించి తప్పుగా మాట్లాడటం, వారి గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తే సహించబోనన్నారు. అలాంటి వారు వ్యక్తిగతంగా తనకు ఎంతటి మద్దతుదారులయినా వారిని వదులుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోనన్నారు.

అదేవిధంగా జనసేన పార్టీకే చెందిన కొందరు మహిళా నాయకురాళ్లపైన, కార్యకర్తలపైన సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం, వారిని అవమానించడం చేస్తున్నారని.. ఇలాంటివాటిని సహించబోనని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు.

కాగా పవన్‌ కళ్యాణ్‌ తన వారాహి దీక్షను విరమించారు. ఇన్నాళ్లూ దీక్షలో ఉన్న ఆయన చందనం రంగు దుస్తులను ధరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీక్ష పూర్తవడంతో మళ్లీ సాధారణ దుస్తులు ధరించారు.

Tags:    

Similar News