పిఠాపురంలో గబ్బర్ సింగ్ టార్గెట్ రీచవుతాడా ?
2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు, బీజేపీ వెంట నడిచాడు
ఆంధ్రా రాజకీయాల్లో రాబోయే ఎన్నికల తర్వాత ఎవరి భవిష్యత్ ? ఎవరి గెలుపు, ఓటములు ఎలా ఉన్నా జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ కు మాత్రం ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య అని చెప్పాలి. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు, బీజేపీ వెంట నడిచాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేధించి 2019 ఎన్నికల్లో చంద్రబాబు, బీజేపీ మీద దుమ్మెత్తిపోశాడు. స్వయంగా భీమవరం, గాజువాక శాసనసభ స్థానాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు చోట్లా ఓటమి చవిచూశాడు. భీమవరంలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో 8 వేల ఓట్లతో, గాజువాకలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో దాదాపు 17 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు.
తిరిగి 2024 ఎన్నికల నాటికి మొదట బీజేపీకి, తర్వాత చంద్రబాబుకు దగ్గరయిన పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఏర్పాటులో కీలకంగా పనిచేశాడు. పొత్తులో బాగంగా టీడీపీ-144, జనసేన-21, బీజేపీ-10 అసెంబ్లీ స్థానాల్లో, అలాగే తెలుగుదేశం-17, బీజేపీ-6, జనసేన-2 లోక్‌సభ స్థానాల్లో పోటిచేస్తున్నాయి. ఈ సారి పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి చెందిన కాపు ఓట్లు అధికంగా ఉన్న పిఠాపురం శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగాడు. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి దాదాపు 91 వేల ఓట్లు ఉన్నాయి. అయితే గత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ సారి కాపులు ఎంత వరకు పవన్ ను ఆదరిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
గత ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుండి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి పెండెం దొరబాబుకు 83459 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ఎస్ వీ ఎస్ ఎన్ వర్మకు 68467 ఓట్లు వచ్చాయి. 15 వేల ఓట్ల ఆధిక్యంతో జగన్ పార్టీ గెలిచింది. జనసేన తరపున పోటీ చేసిన మాకినీడి శేషు కుమారికి కేవలం 28011 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి పవన్ ను ఎంత వరకు ఆదరిస్తారో అన్న అనుమానాలు విశ్లేషకులు వెలిబుచ్చుతున్నారు. అయితే... వర్మకు పడిన ఓట్లు, జనసేన అభ్యర్థికి పడిన ఓట్లు మాత్రమే ఈసారి పడినా గెలుపు గ్యారంటీ. కానీ జనసేన క్యాంపెయినర్లు లక్ష ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం ఖాయం అని చెబుతున్నారు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. చంద్రబాబు కూడా చరిత్ర లిఖించే మెజారిటీ తేవాలని పిలుపునిచ్చారు. భారీ మెజారిటీ రావచ్చు గాని లక్ష అన్నదే కష్టం. ఆంధ్రా రాజకీయాల్లో పవన్ మీద ఉన్న పలు విమర్శల నేపథ్యంలో ఈ సారి ఆయన గెలవడం అత్యంత ఆవశ్యకం. లేకుంటే ఇక ఆయన రాజకీయ భవిష్యత్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఆయన కంటే ఎక్కువగా కాపు సామాజిక వర్గానికే నష్టం.