పిఠాపురంలో "లక్ష"... ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాను పోటీ చేయబోయే నియోజకవర్గం పిఠాపురం అని పవన్ ప్రకటించినప్పటినుంచీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై చర్చ మొదలైంది. మరొపక్క ఇక్కడ వైసీపీ ఫుల్ కాన్ సంట్రేషన్ చేయడం మరింత చర్చనీయాంశం అయిన సమయంలో పిఠాపురంలో "లక్ష" ఇప్పుడు వైరల్ అంశంగా ఉంది.
అవును.. పిఠాపురంలో ఇప్పుడు "లక్ష" అనేది తీవ్ర చర్చనీయాశం. పిఠాపురం నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో గెలవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలా అనడం పెద్ద కష్టమేమీ కాకపోయినా.. అది సాధించడం అంత ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో తనను ఓడించడానికి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా వైసీపీ పెద్దలు రెడీగా ఉన్నారని అన్నారు పవన్!
అంటే.. అక్కడ వైసీపీ నేతలు కుటుంబానికి లక్ష రూపాయలు పంచడానికి సిద్ధంగా ఉన్నా కూడా పవన్ కి లక్ష మెజారిటీ రావాలన్నమాట. అయితే... వైసీపీ నేతలు కుటుంబానికి లక్ష పంచుతున్నారనే ఆరోపణలు, ప్రజలను అవమానించే మాటల సంగతి కాసేపు పక్కనపెడితే... పిఠాపురంలో పవన్ కు లక్ష మెజారిటీ రావడం అంత సులువు కాదని.. దీనికోసం పవన్ అవిరామ కృషి చేయాలని అంటున్నారు.
వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓట్లు సుమారు 92వేల వరకూ ఉన్నాయని.. పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అదే అని అంటున్నారు. వాళ్లంతా గంత గుప్పగా తనకు ఓట్లు వేస్తే.. మిగిలిన సామాజికవర్గ ఓట్లు 20 నుంచి 30 శాతం లభిస్తే... లక్ష మెజారిటీ రాకపోయినా... గెలుపు అయితే సాధ్యం అయ్యే పనే! అయితే కాపుల ఓట్లు గంతగుప్పగా పవన్ కు పడటం అనేదే ఇక్కడ కీలక అంశం.
ఎందుకంటే... ఇక్కడ ఎస్సీ, బీసీల ఓట్లు లక్షా ముప్పై వేల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఓట్లలో మెజారిటీ శాతం వైసీపీకే పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క ఇక్కడ జనసేన ప్రత్యర్థి వంగ గీత కూడా కాపు సామాజికవర్గంతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంది. మరోపక్క కాపు ఉద్యమ నేత ముద్రగడను కూడా పిఠాపురంలోనే మొహరించాలని వైసీపీ భావిస్తుందని అంటున్నారు.
ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు వంటి నేతలతో పాటు పిఠాపురం సిట్టింగ్ ఎంపీ పెండెం దొరబాబు సైతం వారి వారి ప్రయత్నాలు వారు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ తాను చెబుతున్నట్లుగా లక్ష మెజారిటీ సాధించాలంటే చాలానే కష్టపడాలని అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా అక్కడున్న ప్రజానికానికి నమ్మకం కలిగించాలని చెబుతున్నారు.
ఇటీవల మంగళగిరిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్... ఇకపై పిఠాపురం తన స్వగ్రామం అన్నారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్లు, ఇతర మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో... పవన్ ని పిఠాపురం ప్రజలు నమ్మే అవకాశం ఉంది.
కాకపోతే... గతంలో భీమవరంలోనూ ఇవే మాటలు చెప్పారనే విషయం మాత్రం ఇక్కడ కీలకం! పిఠాపురంలో ఓడిపోయినా కూడా అందుబాటులో ఉంటాననే విషయం పవన్ చెబితేనే... నియోజకవర్గ ప్రజలు మరింతగా నమ్మే అవకాశం ఉందని అంటున్నారు. కారణం... భీమవరంలో ఓడిపోయిన అనంతరం 2019 నుంచి 2024 వరకూ పవన్ కేవలం మూడు సార్లు మాత్రమే భీమవరాన్ని విజిట్ చేశారు!
ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు, ఈ కారణాలను పరిగణలోకి తీసుకుని... పిఠాపురంలో నిజంగా లక్ష మెజారిటీ సాధించాలంటే పవన్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్టేట్ మెంట్ల వల్ల పనులు జరగవని ఇప్పటికే తెలిసిన అనుభవాన్ని పిఠాపురంలో పవన్ పరిగణలోకి తీసుకొవాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు!