పవన్ తొలి సభ ఎలా ఉందంటే...!?

స్థానిక సమస్యలు తీరుస్తాను అని పవన్ అన్నారు. పిఠాపురం చేబ్రోలులో పవన్‌ తొలి ఎన్నికల ప్రచారం వారాహి వాహనం పైనుంచి సాగింది.

Update: 2024-03-31 03:42 GMT

పిఠాపురంలో పవన్ నిర్వహించిన తొలి సభ ఎలా ఉంది అన్న దాని మీద చూస్తే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ స్పీచ్ లో ఆవేశం పాళ్ళు బాగా తగ్గినట్లుగా అనిపించింది. ఆయన నెమ్మదిగా మాట్లాడారు. చాలా చోట్ల తడుముకుంటూ కూడా మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి తాను ఏమి చేయగలను అన్నది వివరించే ప్రయత్నం చేశారు. తాను కనుక ఎమ్మెల్యేగా అయితే పిఠాపురాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా చేస్తాను అని చెప్పారు.

స్థానిక సమస్యలు తీరుస్తాను అని పవన్ అన్నారు. పిఠాపురం చేబ్రోలులో పవన్‌ తొలి ఎన్నికల ప్రచారం వారాహి వాహనం పైనుంచి సాగింది. ఓవన్ తన ప్రసంగం మొదలెడుతూనే వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్‌ మీద సెటైర్లు వేశారు. ఈ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అంటూ తన గాజు గ్లాస్ కి గతంలో జగన్ వేసిన సెటైర్ కి కౌంటర్ ఇచ్చారు అన్న మాట. గాజు గ్లాస్ ఉండాల్సింది సింక్ లో అని సిద్ధం సభలలో జగన్ అన్నారు.

దానికి ఇపుడు పవన్ నుంచి కౌంటర్ వచ్చిందన్న మాట. ఇక పిఠాపురం గురించి కూడా పవన్ గొప్పగానే చెప్పారు. శ్రీపాద వల్లభుడి క్షేత్రం అన్నారు. తనకు శ్రీపాద వల్లభుడు అంటే ఇష్టమని కూడా చెప్పుకున్నారు. అదే విధంగా చూస్తే పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని పవన్ అనడం విశేషం.

ఇక తన గురించి ఆయన చెప్పుకుంటూ తాను మాట ఇచ్చానంటే ప్రాణం పోయినా వెనక్కి తీసుకోను అని అన్నారు. మరో వైపు చూస్తే తనకు ఎపుడూ సినిమాలపైన అలాగే రాజకీయాలపై ఆసక్తి లేదు అని ఆయన అన్నారు. కానీ ఆయా రంగాలలో తాను అడుగు పెట్టాను అంటే అది శ్రీపాద వల్లభుని దయ మాత్రమే అని చెప్పారు. తాను గెలుపు ఓటములను ఒక్కలా చూస్తానని అందుకే తాను దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నానని అన్నారు.

ఈ సందర్భంగా పవన్ మరో మాట అన్నారు. 2014లో తాను పార్టీ పెట్టినపుడు పాతికేళ్ల రాజకీయం చేస్తాను అని చెప్పానని అందులో పదేళ్ళు అలా గడచిపోయాయని ఆయన ఒకింత నిర్వేదంతో చెప్పారు. అంటే తాను చట్ట సభలలో ఎన్నిక అయి వెళ్లలేదు అని ఆయన భావంగా అంటున్నారు.

ఈసారి మాత్రం తప్పకుండా తాను తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమి కూడా వెళ్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. తనకు లక్ష మెజారిటీ ఇస్తామని పిఠాపురం ప్రజలు అన్నారు అందుకే పోటీ చేస్తున్నాను అని పవన్ చెప్పారు. అదే సమయంలో రెండు చేతులూ జోడించి ప్రజలను అర్ధిస్తున్నా నన్ను గెలిపించండి అని కోరారు. నేను మీ కోసం నిలబడతా నన్ను ఆశీర్వదించండి అని పవన్ చెప్పుకొచ్చారు.

ఇక పవన్‌ కల్యాణ్‌ అంటే జవాబుదారీతనం అని కూడా ఆయన అన్నారు. ఏపీ ప్రజలకు వైసీపీ కావాలా కూటమి కావాలా అన్నది వారే నిర్ణయించుకోవాలని పవన్ అన్నారు. తాను ఎమ్మెల్యే అయితే పిఠాపురానికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు తెస్తానని అన్నారు. ఇదిలా ఉంటే పవన్ స్పీచ్ లో మునుపటి వాడి వేడి కనిపించలేదు. తోలు తీస్తాం, పాతాళానికి తొక్కేస్తామన్న భీకరమైన మాటలు వినిపించలేదు.

మరి ఆయన స్పీచ్ మార్చుకున్నారా లేక ఎమ్మెల్యేగా జనాల తీర్పు కోసం ఇలాగే మాట్లాడాలి అని భావించి వచ్చారా అన్నది తెలియడంలేదు కానీ పవన్ మార్క్ స్పీచ్ అయితే తొలి సభలో లేదని అన్నారు. ఇక పవన్ ని చూసేందుకు జనాలు విరగబడి వచ్చారు. అదే వూపు అదే జోష్ అయితే జనంలో ఉంది

పవన్ స్పీచ్ లో మాత్రం వైసీపీ నేతల మీద సెటైర్లు వేశారు. తనను ఓడించడానికి మండలానికి ఒక లీడర్ ని పెట్టారని, డబ్బులు వెదజల్లుతున్నారని తన మీద వైసీపీకి ఎందుకు ఇంత కక్ష అని కూడా ఒక దశలో పవన్ నిలదీశారు. తాను పేదల పక్షం అన్నారు. జగన్ పెత్తందారు అని అన్నారు. ఏపీకి సీఎం తాను కాదు జగనే కదా అని కూడా అన్నారు.

అధికారం మీ వద్ద ఉంచుకుని అరాచకాలు చేస్తూ పెత్తందారులుగా మమ్మల్ని అంటారా అని నిలదీశారు. ఏది ఏమైనా పవన్ తొలి సభలో అయితే తన స్వభావానికి కొంత విరుద్ధంగా ఆవేశం తగ్గించి పవన్ మాట్లాడారు. మరి రానున్న రోజులలో ఆయన ఇంకా ఇలాగా మాట్లాడుతూ ఇదే టెంపో కొనసాగిస్తారా లేక నెమ్మదిగానే మాట్లాడి అన్ని వయసుల వారి అభిమానం చూరగొనే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News