పవన్ మార్కు చూపడానికి ఆ రెండే అడ్డంకి!
తన శాఖలపై ఇప్పటికే అధికారులతో పవన్ సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. స్పష్టంగా అన్ని శాఖలకు కార్యాచరణను ఆయన నిర్దేశించారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేసి.. కూటమి అఖండ విజయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా, అడవులు, పర్యావరణం, శాస్త్రసాంకేతిక రంగాలు వంటి కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నారు.
తన శాఖలపై ఇప్పటికే అధికారులతో పవన్ సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. స్పష్టంగా అన్ని శాఖలకు కార్యాచరణను ఆయన నిర్దేశించారు. ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో డయేరియా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు.
ఇక అటవీ శాఖకు సంబంధించిన సమీక్ష సందర్భంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇలా తాను ఏరి కోరి ఎంచుకున్న శాఖలన్నింటిపైనా పవన్ కళ్యాణ్ మిగతా మంత్రులకు మించి వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అయితే పవన్ దూకుడుగానే ఉన్నారు.
అయితే పవన్ మార్కు కనపడాలంటే రెండు విషయాల్లో ఆయన తన పనితీరును సమర్థవంతంగా చూపాల్సి ఉంటుందని అంటున్నారు. వాటిలో ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణాతోపాటు రహదారుల అభివృద్ధి, మర్మమతులు ఉన్నాయి.
రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో మాత్రమే లభించే ఎర్రచందనం విదేశాలకు స్మగ్లింగ్ అవుతోంది. పెద్ద ఎత్తున ఎర్రచందనం తరలిపోతోంది. అధికారులు చర్యలు తీసుకుంటున్నా దీనికి అడ్డుకట్టపడటం లేదు.
ఈ నేపథ్యంలో ఇటీవల దీనిపై సమీక్షించిన పవన్ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడాలని అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేపాల్ కు వీరు ఎర్రచందనం స్మగ్లింగ్ లో కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.
ఎట్టకేలకు పవన్ ఆదేశాలతో పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో గట్టిగానే వ్యవహరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎక్కడికక్కడ ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుని, దాన్ని తరలిస్తున్నవారిని అరెస్టు చేశారు. అయితే ఎర్రచందనం రాష్ట్రానికే పరిమితమైన సమస్య కాదు. పవన్ అన్నట్టుగా దీని మూలాలు అంతర్జాతీయ స్థాయి వరకు విస్తరించాయి. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకట్ట పడాలంటే పవన్ ఇంకా గట్టిగానే కృషి చేయాల్సి ఉంటుంది.
అలాగే వైసీపీ ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిన అంశం.. రోడ్లు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన రాష్ట్రంలో కునారిల్లిన రోడ్ల దుస్థితిని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చింది. పార్టీ నేతలు, కార్యకర్తలు నరకానికి న కళ్లుగా మారిన రోడ్ల ఫొటోలను తీసి వెలుగులోకి తెచ్చారు. కొన్ని చోట్ల జనసేన నేతలే మరమ్మతులు కూడా చేశారు.
రాష్ట్రంలో వైసీపీ హయాంలో రోడ్లను పూర్తిగా గాలికొదిలేశారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు వర్షాకాలం కూడా కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో రోడ్లను యుద్ధప్రాతిపదికన నిర్మించడానికి పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం 7,213 కిలోమీటర్లకుపైగా ఉన్న రోడ్లను బాగు చేయడానికి రూ.4,976 కోట్ల నిధులను ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామీణ రహదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను 30 శాతం నుంచి పది శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని కోరతానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
వాస్తవానికి అన్ని రాష్ట్రాలకు ఈ నిబంధన ఒకేలా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కేటాయిస్తే కేంద్రం తన వంతుగా నిధులు కేటాయిస్తుంది. ఏదో ఒక రాష్ట్రం కోసం మినహాయింపులు ఇవ్వదు. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వ మనుగడ టీడీపీ, జనసేన ఎంపీలపైనే ఆధారపడి ఉండటంతో కేంద్రం పవన్ కోరికకు సమ్మతించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అందులోనూ ప్రధాని మోదీ దగ్గర పవన్ పట్ల ఉన్న ప్రత్యేక అభిమానం రీత్యానూ పవన్ విన్నపానికి కేంద్రం అంగీరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తి స్థాయిలో కళ్లెం వేయడంతోపాటు రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టిస్తే పవన్ కళ్యాణ్ పరిపాలనలో తన మార్కును చూపించినట్టేనని చెబుతున్నారు.