ఏపీ డిప్యూటీ సీఎం కు హై-ప్రొఫైల్ సెక్యూరిటీ!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఉపముఖ్యమంత్రి హోదాను పొందారు జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఉపముఖ్యమంత్రి హోదాను పొందారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇలా డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు కీలకమైన శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. అందులో ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ & టెక్నాలజీ వంటి కీలక శాఖలు పవన్ కు కేటాయించబడ్డాయి. ఈ సమయంలో పవన్ సెక్యూరిటీ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... మొన్న పవర్ స్టార్, నిన్న జనసేన అధినేత, నేడు వీటీన్నింటితోపాటు ఏపీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కల్యాణ్. ఈ సమయంలో ఆయన సెక్యూరిటీకి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి జనసేన అధినేత అయినప్పటినుంచీ పవన్ కు సెక్యూరిటీ బాగా పెరిగింది. ఇందులో భాగంగా ఆయన ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్నారు.
గతంలో తనను హత్య చేయాలని ఇంటివద్ద రెక్కీ నిర్వహించారని.. తనను టార్గెట్ చేశారని.. తనకు థ్రెట్ ఉందని.. అందుకే ఎప్పుడైనా అభిమానులను, కార్యకర్తలను దూరం పెడితే అర్ధం చేసుకోమని పవన్ పలుమార్లు తెలిపారు. ఇటీవల పిఠాపురంలో బ్లేడ్లు పట్టుకుని తనను, తన సెక్యూరిటీని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో పవన్ సెక్యూరిటీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
ఇందులో భాగంగా... ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పవన్ కల్యాణ్ కు ఉన్నత స్థాయి భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర బలగాలను కోరిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నందున ఆయన కాన్వాయ్ లో ఒక ఎస్పీజీ కమాండో, రెండు ఎన్.ఎస్.జీ కామాండోలతో కూడిన 4 కార్లు ఉంటాయని అంటున్నారు.
ఇదే సమయంలో రెండు సీఆర్పీఎఫ్ సిబ్బంది సెక్యూరిటీతో రెండు వాహనాలు, ఒక జామర్ వాహనం కూడా ఉంటాయని చెబుతున్నారు. ఇటు ప్రభుత్వంలో మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఉండటంతోపాటు సినిమాల్లోనూ సూపర్ స్టార్ గా ఉండటంతో పవన్ భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు!