పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం... ఆలాగైతే హిట్టే ?

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆయన వరసబెట్టి శాఖల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు

Update: 2024-06-30 02:45 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆయన వరసబెట్టి శాఖల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా అటవీ శాఖ పర్యావరణం శాఖలు పవన్ చేతిలో ఉన్నాయి.

ఈ శాఖలను పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అంతే కాదు పవన్ కి కేంద్రంలో మోడీతో ఉన్న పరిచయాలు పలుకుబడి వల్ల ఎక్కువగానే నిధులు చేసుకోగలుగుతారు అని అంటున్నారు. ఆ విధంగా భారీ ఎత్తున తెచ్చుకున్న నిధులతో ఏ కొరతా లేకుండా తన శాఖలలో పనులు చేసిపెట్టాలని పవన్ ఆలోచిస్తున్నారుట.

గ్రామాభివృద్ధికి పెద్ద పీట వేయడం ద్వారా తాను అంటో చూపించుకోవాలని అనుకుంటున్నారుట. ఆ విధంగా గ్రామ సీమలు ప్రగతి సీమలుగా చేస్తే పవన్ ఖ్యాతి ఇంతకు ఇంత పెరుగుతుంది. అందుకే ఆయన అధికారులతో మీటింగులతో ఒక్కటే చెబుతున్నారు. శాఖాపరంగా ఎవరూ తప్పు చేయరాదని. ఇటీవల పవన్ కళ్యాణ్ శాఖలలో స్వచ్చాంధ్రా మిషన్ కి వచ్చే వేలాది కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్ళించేసింది. దాంతో పవన్ ఫైర్ అయ్యారు.

అలా ఎందుకు జరిగింది అని సమగ్రమైన నివేదికను ఆయన కోరారు. ఇది ఒక విధంగా అధికారులకు హెచ్చరికగా చూస్తున్నారు. రానున్న రోజులలో శాఖాపరంగా ఒక్క పైసా దారి మళ్ళడానికి లేదని కూడా పవన్ పట్టుదలగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం సంక్షేమానికి నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు నిధుల కొరత ఎదురైతే ఇతర శాఖల నుంచి నిధుల మళ్ళింపు చేస్తూ ఉంటారు. అది ఎవరైనా సహజమే. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా కొన్ని శాఖల నిధులను అలా మళ్ళించింది అన్న ప్రచారం ఉంది.వైసీపీ అయితే అడ్డగోలుగా అదే పని చేసి పూర్తిగా సంక్షేమానికే ఖర్చు చేసింది

ఇపుడు పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారు కాబట్టి పంచాయతీ రాజ్ శాఖ నిధులను ఏ ఇతర అవసరాలకు ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఆ విధంగా కట్టడి చేసేందుకే అధికారులకు పవన్ తొలుత క్లాస్ పీకారని అంటున్నారు.

ఏపీలో నిధుల కొరత చాలా ఉంది. వైసీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు సంక్షేమం పేరుతో టీడీపీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో వచ్చిన నిధులను వచ్చినట్లుగా దారి మళ్ళించకపోతే కొన్ని పధకాలకు చాలా ఖర్చులను తట్టుకోవడం కష్టమని అంటున్నారు.

అయితే పవన్ శాఖల మీదకు మాత్రం ప్రభుత్వ పెద్దలు రాలేరని అంటున్నారు. దాంతో పవన్ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. తన శాఖలలో అభివృద్ధి కోసం పవన్ ప్రత్యేక అజెండా రూపకల్పన చేసుకున్నారని అంటున్నారు. ఆయన కేంద్ర పెద్దలను ఒప్పించి మరిన్ని నిధులు తెచ్చుకుంటారని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ మార్క్ వ్యూహం బాగుంది అని అంటున్నారు.

Tags:    

Similar News