ఆవేశంతో ఊగిపోయిన పవన్ ..!
తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ లోని బడబాగ్ని బద్ధలు అయింది. ఆయన ఇంతకాలం దాచుకున్న మౌనం కాస్తా ప్రళయ గర్జనగా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని అంతా తాడేపల్లిగూడెం సభలో చూపించారు. జగన్ నీకు ఇంతకాలం ఈ పవన్ శాంతిని చూపించాడు. ఇపుడు యుద్ధం చూపిస్తాడు కాచుకో అంటూ పెను గర్జనే చేశారు. కేవలం 24 సీట్లు అంటున్నారు. ఆ సీట్లను తీసుకునే వామనావతారం లో ఉన్న అపర త్రివిక్రముడు మాదిరిగా వైసీపీని పాతాళానికి తొక్కేస్తామని ఆయన హెచ్చరించారు.
తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ లోని బడబాగ్ని బద్ధలు అయింది. ఆయన ఇంతకాలం దాచుకున్న మౌనం కాస్తా ప్రళయ గర్జనగా మారింది. వైసీపీ అన్న పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తామంటూ పవన్ శపధం చేశారు. ఈసారి వైసీపీని ఓడించకపోతే తాను పవన్ కళ్యాణ్ కానే కాదని తన పార్టీ జనసేన కాదని ఆయన ప్రతిజ్ఞ చేయడం విశేషం. తాను వ్యక్తిగత స్వార్ధంతో పొత్తులు పెట్టుకోవడంలేదని అన్నారు. రాష్ట్రం దేశం కోసమే పొత్తులు పెట్టుకుంటున్నానని చెప్పారు.
తాను ఏపీలో వైసీపీ పాలన పోవాలనే టీడీపీతో జత కట్టాను అన్నారు. ఏపీలో గత అయిదేళ్ల వైసీపీ పాలనలో అయిదు కోట్ల మంది ప్రజానీకం తో పాటు చంద్రబాబు కూడా బాధితుడే అని ఆయన అన్నారు. రాజకీయ ఉద్ధండుడు లాంటి బాబుని యాభై మూడు రోజులు జైలులో పెడతారా అని ఆయన ఫైర్ అయ్యారు.
ఏపీలో మాట్లాడితే బెదిరింపులు హెచ్చరికలతో పాలన సాగిందని, అయితే ఈసారి తాము అధికారంలోకి వస్తే మాత్రం వైసీపీ గూండాలను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతామని అన్నారు. వ్యవస్థలు అన్నీ భ్రష్టు పట్టాక చేసేది ఏమీ ఉండదని ఆయన అనేక ప్రపంచ చరిత్రలోని ఉదాహరణను వినిపించారు.
అందరూ రాజకీయంగా పోటీ పడుతున్నా కొన్ని సార్లు సహకారం అందించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో సహకారం సంఘర్షణ పక్కపక్కనే ఉంటాయని పవన్ చెప్పారు. అందుకే తాను చంద్రబాబుతో జత కట్టాను అన్నారు. ఇది సహకారం అందించుకునే సమయం టీడీపీ జనసేన కలిసికట్టుగా ముందుకు సాగితే మాత్రం ఏపీలో వైసీపీ పాలన అంతం కావడం ఖాయం అన్నారు.
ఆ దిశగానే తాను తగిన కార్యాచరణతో ముందుకు వచ్చాను అని అన్నారు. తన వ్యూహాల వెనక ఏపీ సంక్షేమం తప్ప మరోటి లేదని అన్నారు. పదేళ్ళుగా ఏపీ మేలు కోసం తాను పోరాడుతున్నాను కానీ అధికారం కోసం కానే కాదని ఆయన స్పష్టం చేశారు. తన వెంట నడచే వారు ఎవరైనా తనను అర్ధం చేసుకుని ముందుకు సాగాలని ఎందుకంటే తాను చేస్తున్నది ప్రజల మేలు కోసమే అన్నది పవన్ విడమరచి చెప్పారు.
తనను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న జగన్ వ్యక్తిగత జీవితం చిట్టా అంతా తన దగ్గర ఉందని పవన్ హెచ్చరించారు. తాను దాన్ని చెప్పాలంటే టన్నులు టన్నులుగా ఉంటుందని చెప్పేదా అని సవాల్ చేశారు. ఏపీలో వైసీపీ చీడ కొద్ది రోజులలో పోతుందని ఆయన జోస్యం చెప్పారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం ఆవేశపూరితంగా సాగింది. పవన్ ఆవేశపూరితంగా ప్రసంగిస్తున్నపుడు చంద్రబాబు సైతం వేదిక మీద నుంచి కళ్లార్పకుండా చూస్తుండిపోయారు. పవన్ ప్రతీ మాట ఒక్క నిప్పు కణికగా వదిలారు. టీడీపీ నేతలతో పాటు అంతా ఆయన స్పీచ్ ని ఆద్యంతం ఆసక్తిగా వినడమే కాదు పవన్ ఫైర్ ఏంటో తొలిసారిగా చూసారు.