ఫ్యాన్ ఇచ్చిన పెన్నుతో పవన్ తొలి సంతకం... వీడియో వైరల్!

అయితే అది మాటల్లో కాదు చేతల్లో అని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైన నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర ఘటన తెరపైకి వచ్చింది.

Update: 2024-06-19 07:19 GMT

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవన్ కల్యాణ్ కు - ఆయన ఫ్యాన్స్ కూ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారే ఆయన బలం, బలహీనత అని అంటుంటారు. వీరికి పవన్ నే అన్నీ అని చెబుతుంటారు. అయితే అది మాటల్లో కాదు చేతల్లో అని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైన నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర ఘటన తెరపైకి వచ్చింది.

అవును... ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడకు చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉపముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అడుగుపెట్టారు. ఈ మేరకు విజయవాడలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లో ఉన్న క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ, నాగబాబు మొదలైన వారు పవన్ కల్యాణ్ కు అభినందనలు తెలిపారు. ఈ సమయంలో తన శాఖలకు చెందిన పలు ఫైల్స్ పై పవన్ కల్యాణ్ సంతకాలు చేశారు. ఇక్కడే ఒక ఆసక్తికర ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఫైల్స్ పై సంతకాలు చేసేందుకు ఆయన అభిమాని ఇచ్చిన పెన్నును ఉపయోగించారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం మంగళగిరి నుంచి బయలుదేరి అమారావతిలో ఉన్న సచివాలయానికి బయలుదేరారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా అమరావతి రైతులు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సమయంలో పవన్ కాన్వాయ్ వెళ్తుండగా.. ఓ అభిమాని ఓ పెన్నును గిఫ్ట్ గా అందించారు. దీంతో... ఆ పెన్నును జేబులో పెట్టుకున్నారు పవన్.

కట్ చేస్తే... ఇవాళ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఫైల్స్ పై సంతకాలు చేయడానికి అదే పెన్నును ఉపయోగించారు పవన్. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. పవన్ కు ఆయన ఫ్యాన్స్ కూ మధ్య ఉన్న ప్రేమాభిమానాలకు ఇది ఒక తాజా ఉదాహరణ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కాగా... ఇటీవల పవన్ కల్యాణ్ కు ఆయన వదిన సురేఖ ఓ పెన్ ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఆ పెన్ విలువ లక్షకు పైగా ఉంటుందనే కామెంట్లు వినిపించాయి. అయినప్పటికీ ఆ పెన్ తో కాకుండా ఫ్యాన్ ఇచ్చిన పెన్ తో పవన్ ఫైల్స్ పై సంతకం చేయడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Tags:    

Similar News