వారాహితో పవన్ ఆ కిక్కే వేరబ్బా...ఇంతకీ ఎక్కడ ఉంది...?
జనసేన అధినేత వారాహి పేరిట ఒక అద్భుతమైన అత్యాధునికత తో కూడిన వాహనాన్ని తయారు చేయించారు.
జనసేన అధినేత వారాహి పేరిట ఒక అద్భుతమైన అత్యాధునికత తో కూడిన వాహనాన్ని తయారు చేయించారు. ఆ వారాహి ముచ్చట 2022 నాటిది. దాన్ని ఆ ఏడాది విజయదశమి నుంచి జనంలో ఉంచి మొత్తం ఎన్నికలు అయ్యేంతవరకూ పవన్ ఏపీ వ్యాప్తంగా నాన్ స్టాప్ గా తిరుగుతారు అని అంతా అనుకున్నారు.
అయితే ఆ ముహూర్తం కాస్తా 2023కి మారింది. 2023లో వారాహి రెండు మూడు నెలల పాటు విడతల వారీగా కొన్ని ఎంపిక చేసిన జిల్లాలలో తిరిగింది. పవన్ వారాహి రధమెక్కితే జనంలో అద్భుతమైన స్పందన వచ్చింది. గోదావరి జిల్లాలలో పవన్ వారాహి ఎక్కి ప్రసంగాలు చేస్తూ వచ్చారు. ఒక దశలో పవన్ ఏపీలో ఒక బలమైన ఆల్టర్నేషన్ గా కనిపించారు.
అయితే ఆ తరువాత చూస్తే గత కొన్ని నెలలుగా వారాహి కనిపించలేదు. 2023 అక్టోబర్ నెలలో ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో పవన్ కొద్ది రోజుల పాటు వారాహి యాత్ర నిర్వహించారు. ఇప్పటికి మూడు నెలలుగా వారాహి గురించి సమాచారం అయితే లేదు. నిజానికి వారాహిని పవన్ కళ్యాణ్ ఎంతో ముచ్చట పడి ప్రత్యేకంగా రూపొందించారు.
దాన్ని ఎన్నికల ప్రచార వాహనంగా చేసుకోవాలని కూడా భావించారు. ఈ వారాహి వాహనంలో పవన్ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక భద్రతతో పాటు బహిరంగ ప్రసంగాలు చేసేందుకు గట్టి ఏర్పాట్లు చేశారు.పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో ఉన్న ఫోటోలు సైతం అప్పట్లో సోషల్ మీడియాలో ఒక లెవెల్ లో ట్రెండ్ అయ్యాయి.
వారాహి వాహనం ప్రజలకు ఎంతో ఆకట్టుకుంటోంది. పవన్ ఎటూ అట్రాక్షన్ గానే ఉన్నారు. దాంతో పాటు వారాహి వాహనం కూడా స్పెషల్ అట్రాక్షన్ అని అంటున్నారు. ఏపీలో ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో వారాహి వాహనంతో పవన్ ఏపీ అంతా కలియ తిరిగితే ఆ కిక్కే వేరబ్బా అనేట్లుగా సీన్ ఉంటుంది అంటున్నారు.
మరి వారాహి ఎక్కడ ఉంది అన్నదే ఇపుడు ముందుకు వస్తున్న ప్రశ్న. అసలు వారాహి వాహనానికి ఏమైంది అనే ప్రశ్న కూడా వస్తోంది. ఎన్నికల వేళ వారాహి వాహనంపై ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తానని పవన్ ప్రతిజ్ఞ చేయడాన్ని కూడా అంతా గుర్తు చేస్తున్నారు.
ఏపీలో టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి. ఎన్నికలు చూస్తే చాలా ముఖ్యమైనవి కీలకంగా ఉన్నాయి. మరి ఈ కూటమి తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా వారాహి రధమెక్కి పవన్ జనంలోకి వస్తే జనాలకు పూనకాలే వస్తాయని అంటున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితానికి వెళ్తే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చైతన్య రథంతో ఉమ్మడి ఏపీలో రాజకీయాలను మొత్తం మార్చేశారు. ఆయన మొత్తం రాష్ట్రాన్ని తొమ్మిది నెలలలో చుట్టేశారు. పవన్ సైతం వారాహితో ఆ విధంగా చేయడానికి విలువైన సమయమే ఉంది అంటున్నారు.
వారాహితో జనంలోకి రావడం ద్వారా పవన్ ప్రజల దృష్టిలో శాశ్వత ముద్ర వేయవచ్చు అని అంటున్నారు. అవసరం అయితే చంద్రబాబును లోకేష్ ని కూడా తనతో పాటుగా వారాహి రధం మీద పెట్టి ఏపీలో తిరిగేందుకు పక్కా ప్లాన్ చేస్తే ఈసారి ఎన్నికలకు కొత్త కళ వస్తుంది అని అంటున్నారు.
అలా చేస్తే కనుక ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వంపై ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వారాహి రధం అవసరమైన అదనపు శక్తినే అందిస్తుంది అని అంటున్నారు. మరి వారాహి లాంటి ఐకానిక్ వాహనాన్ని ఏపీ రోడ్లపైకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తారా అన్నదే ఇక్కడ పాయింట్. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలసి ఏపీలో 22 దాకా బహిరంగ సభలకే ప్లాన్ చేశాయి. అంటే సభ పెట్టి జనాలను తరలించే ప్లాన్. ఇది పూర్తిగా రొటీన్ ప్రోగ్రాం గానే అంతా చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కడ అన్నది మళ్లీ జనాల నుంచే ప్రశ్నగా వస్తోంది.