ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం...పవన్ కుండబద్ధలు కొట్టారా...?
ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వం అని తమ్ముళ్ళు ఇప్పటిదాకా చెప్పుకున్నారు.
ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వం అని తమ్ముళ్ళు ఇప్పటిదాకా చెప్పుకున్నారు. అయితే టీడీపీ సోలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోదని జనసేనాని మాటలను బట్టి అర్ధం అవుతోంది. వచ్చేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అని పవన్ కుండబద్ధలు కొట్టారు
సంకీర్ణ ప్రభుత్వం అంటే తెలుసు కదా. అధికారంలో వాటా కచ్చితంగా ఉంటుంది. కర్నాటకలో దేవెగౌడ కుమారుడు కుమారస్వామి జేడీఎస్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే కుమార స్వామి కూడా సీఎం అయ్యాడు. అలాగే జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ 2018లో ఏర్పాటు చేస్తే మళ్లీ కుమార స్వామి సీఎం అయ్యారు. అదన్న మాట మ్యాటర్.
అంటే జనసేన టీడీపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని అదే తమ రెండు పార్టీల పొత్తుల వెనక సారాంశం అని పవన్ స్పష్టంగా చెప్పేశారు. అంటే ఏ పదో పాతిక సీట్లు ఇచ్చి జూనియర్ పార్టనర్ గా జనసేనను ఉంచితే అసలు కుదరదు అన్నదే పవన్ ప్రకటన వెనక అసలు విషయం అంటున్నారు.
ఇప్పటిదాకా టీడీపీతో జనసేన పొత్తుల మీద జనసేనలో అసంతృప్తులు ఉన్నాయని అంటున్న వారు కానీ లేక పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న వారు కానీ అవనిగడ్డలో వారాహి రధమెక్కి ఆదివారం పవన్ చేసిన ఈ సంచలన ప్రకటన తరువాత కచ్చితంగా ఎగిరి గంతేస్తారు అనే భావించాలి. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం అంటే పవన్ కి కూడా కచ్చితంగా సీఎం అయ్యే చాన్స్ ఉంటుంది.
ఇక టీడీపీతో అధికారం పంచుకున్నపుడు కనీసం రెండేళ్ళో రెండున్నరేళ్ళో సీఎం పోస్ట్ పవన్ కి కూడా దక్కే వీలు ఉంటుంది. ఇది నిజంగా జనసేన క్యాడర్ కి సంతోషం కలిగించే వార్తే. అలాగే కాపు సమాజానికి కూడా ఫుల్ జోష్ ని తెచ్చే వార్త.
అయితే సంకీర్ణ ప్రభుత్వం అని పవన్ అంటున్నారు. టీడీపీ నుంచి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తరువాత ఏమంటారో చూడాలి. ఇక టీడీపీ సానుభూతిపరులు అయిన సినీ వర్గాల వారు చంద్రసేన అని సంభోదిస్తున్నారు అంటే చంద్రబాబు పేరుని ముందు పెట్టి సేనను వెనకాల పెడుతున్నారు.
అలా వచ్చేది టీడీపీ ప్రభుత్వం జనసేన సహకారంతో అన్నది వారి ఆలోచనగా ఉంది. ఇక టీడీపీది నాలుగు దశాబ్దాల హిస్టరీ. అటువంటి పార్టీ ఇప్పటిదాకా అనేక పార్టీలతో పొత్తులను పెట్టుకుంది కానీ ఎవరితోనూ అధికారాన్ని షేర్ చేసుకోలేదు. మరో వైపు చూస్తే చంద్రబాబు ఈసారి సీఎం అయ్యేది తన కోసం కాదు, కచ్చితంగా లోకేష్ కోసం.
అయితే అంతకు ముందు ఆయన 2021 వర్షాకాల సమావేశాలలో చేసిన శపధం ఒకటి ఉంది. దాని ప్రకారం ఆయన సీఎం గానే 2024 తరువాత ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. అంటే సీఎం గా మొదట తాను ఆ తరువాత తన కుమారుడు అని ఆయన భావించి ఉంటారు. ఇపుడు సంకీర్ణ ప్రభుత్వం అంటే పవన్ కి షేర్ ఇస్తే లోకేష్ సంగతేంటి అన్నది మరో చర్చగా ముందుకు వస్తుంది.
అలా చూసుకున్నపుడు పవన్ ప్రతిపాదన టీడీపీ పెద్దలకు పచ్చి వెలక్కాయగానే ఉంటుంది. అంతే కాదు ఏపీలో వైసీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీతోనే తట్టుకోలేక టీడీపీ సతమతమవుతోంది. అలాంటిది తామే మరో ప్రాంతీయ పార్టీ అయిన జనసేనకు ఊపిరి పోసి పోటీగా తెచ్చుకుంటాయా అది లోకేష్ దీర్ఘకాలిక భవిష్యత్తుకు మంచిదేనా అన్న చర్చ కూడా ఉంటుంది.
ఇపుడున్న పరిస్థితులు టీడీపీ ఇబ్బందుల దృష్ట్యా పవన్ సంకీర్ణ ప్రభుత్వం అన్నా టీడీపీ ఏమీ అనలేకపోవచ్చు. వన్స్ చంద్రబాబు బెయిల్ నుంచి బయటకు వచ్చాక ఆయన పర్యటనలకు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ చూశాక కచ్చితంగా పొత్తు లెక్కలు మారినా మారుతాయని అంటున్నారు. ఏది ఏమైనా కూడా పవన్ నోట సంకీర్ణ ప్రభుత్వం అన్న మాట రావడం మాత్రం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగానే చూడాల్సి ఉంది అంటున్నారు.