పవన్ తో జోగయ్య కీలక భేటీ.. అసలు తగ్గొద్దంటూ....!?
ఏపీలో కాపులు ఒక్కటి అవుతున్నారు. పెద్ద నాయకులు కూడా మనసు మార్చుకుంటున్నారు.
ఏపీలో కాపులు ఒక్కటి అవుతున్నారు. పెద్ద నాయకులు కూడా మనసు మార్చుకుంటున్నారు. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా కాపులలో కనిపిస్తోంది. 2024 ఎన్నికలను ఒక గోల్డెన్ చాన్స్ గా భావిస్తున్నారు. దీన్ని అసలు వదులుకోవద్దు అని కూడా చెబుతున్నారు
ఇక కాపు నేతగా పేరు ప్రఖ్యాతులు ఉన్న ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో కాపు సేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి జనసేనకు శ్రేయోభిలాషి అయిన మాజీ మంత్రి రాజకీయ భీష్ముడు చేగొండి హరి రామజోగయ్య హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని కలవడం సంచలనం గా మారింది.
ఆయన పవన్ తో సుదీర్ఘంగా చర్చించారు అని అంటున్నారు. ఏపీలో కాపుల ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత పవన్ మీద ఉందని జోగయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశంతో పొత్తుల విషయంలో ఎక్కడా తగ్గవద్దు అని సూచించారు అని అంటున్నారు.
పొత్తులలో భాగంగా ఎక్కువ సీట్లను జనసేన సాధించాలని కూడా దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు. ఈ విషయంలో పవన్ ఎలాంటి మొహమాటాలకు వెళ్ళవద్దని కోరారని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో వెనక్కి తగ్గవద్దని అధికారం విషయంలో షేరింగ్ ఉండాల్సిందే అని కూడా గట్టిగా చెప్పారని తెలుస్తోంది.
పవన్ మీద గురుతర బాధ్యత ఉందని రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారం దక్కేలా చూడాలని జోగయ్య పవన్ని కోరారని అంటున్నారు. ఇది దశాబ్దాల కోరిక అని కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు అని జోగయ్య చెప్పారని తెలుస్తోంది.
దాన్ని పవన్ నిజం చేయాల్సి ఉందని పెద్దాయన చెప్పారని అంటున్నారు. అంతే కాదు సీట్ల దగ్గర ఎలాంటి భేషజాలకు పోయి తగ్గవద్దని కోరారని తెలుస్తోంది. అలాగే సీఎం పోస్టు అన్నది కీలకం అని దాన్ని జనసేన ద్వారానే సాధించాలని జోగయ్య పవన్ ని కోరారని అంటున్నారు.
ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి కూడా జోగయ్య పవన్ కి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ సామాజిక పరిస్థితులు జనసేనకు అనుకూలంగా ఉన్నాయని జోగయ్య పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.
మొత్తానికి పెద్దాయన పనిగట్టుకుని వెళ్ళి మరీ పవన్ కి చెప్పాల్సినవి అన్నీ చెప్పారని అంటున్నారు. ఇక కాపు పెద్దల ఆలోచనలు వారి వ్యూహాలు చూస్తే కనుక కచ్చితంగా జనసేనకు అరవైకి తక్కువ లేకుండా అసెంబ్లీ సీట్లు ఎనిమిదికి తగ్గకుండా ఎంపీ సీట్లు పొత్తులో భాగంగా తెలుగుదేశం ఇవ్వాలాని ఉందని అంటున్నారు.
ఇక రేపటి రోజున జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కనుక పవన్ సీఎం అయ్యేలా ఒప్పందాలు ఉండాలని కూడా కోరుతున్నారు. ముద్రగడ జనసేనలోకి వెళ్లడం అంటే అది జనసేన బలం పెంచడమే కాకుండా కాపులను రాజ్యాధికారానికి దగ్గర చేస్తుందని అంతా నమ్ముతున్నారు.