బాబు అనుభవం రాష్ట్రానికి అవసరం...సీఎం ఎవరో తేల్చేశారా...?

అయితే అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు మరింత కాలం ప్రజా సేవ చేయాలని ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అని పవన్ చేసిన ఈ ట్వీట్ లోని కొన్ని లైన్లే ఇపుడు చర్చకు వస్తున్నాయి.

Update: 2023-10-31 15:59 GMT

అసలు తేల్చేది ఏముంది అందరికీ తెలిసిన విషయమే కదా అని రాజకీయాల మీద అవగాహన ఉన్న వారు అంటారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఎవరు సీఎం అన్న చర్చకు తెర లేచింది. అయితే ఆ చర్చ పవన్ అభిమానులు, జనసైనికులుగా మారిన వారిలో ఉంటే ఉండొచ్చు కానీ పెద్ద పార్టీ టీడీపీ పెద్ద నాయకుడు చంద్రబాబు అయినపుడు ముఖ్యమంత్రి ఆయన కాకుండా ఎవరు అవుతారు అన్నది అందరికీ అర్ధమయ్యే విషయం.

అయితే జనసేనకు ఎమోషనల్ ఓటింగ్ గా జనసైనికులు ఉన్నారు. వారే పార్టీని నడిపిస్తున్నారు. కాబట్టి వారికి రీల్ హీరో అయినా రియల్ హీరో అయినా పవన్ కాబట్టి ఆయనే సీఎం కావాలని కోరుకుంటారు. అందుకే వారి ఎమోషన్స్ ని గౌరవించేలా పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఎన్నికల తరువాత సీఎం ఎవరో తెలుస్తుంది, ముందు జనసేన టీడీపీలను గెలిపించడమే అందరి కర్తవ్యం కావాలని కోరారు. అలాగే జనసైనికులకు పిలుపు ఇచ్చారు.

ఎందుకంటే ఓట్ల బదిలీ అన్నదే ఎపుడూ పొత్తులకు ఆక్సిజన్ కాబట్టి క్యాడర్ ముందు దారిలో పడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా చంద్రబాబు 53 తోజుల సుదీర్ఘ విరామం తరువాత జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన విడుదల మీద మిత్రపక్షం అయిన జనసేన ఉత్సాహపడింది. పవన్ కళ్యాణ్ అయితే విదేశంలో ఉన్నా కూడా ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పంపించారు. బాబుకు మధ్యంతర బెయిల్ లభించడం చాలా సంతోషం అని అన్నారు.

బాబు సంపూర్ణ ఆరోగ్యం ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని కోరుకున్నారు. అంతే కాదు బాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం అని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు అని ట్వీట్ చేశారు. పవన్ చేసిన ఈ ట్వీట్ ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

పవన్ కి బాబు మీద ఇంతటి అభిమానం ఉండడం అందరికీ తెలిసిందే. బాబు జైలులో ఉండగా ఆయన ములాఖత్ ద్వారా వెళ్లి కలిసారు. ఆ తరువాత టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు మీద మిత్రపక్షం నేతగా ఎప్పటికపుడు తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

అయితే అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు మరింత కాలం ప్రజా సేవ చేయాలని ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అని పవన్ చేసిన ఈ ట్వీట్ లోని కొన్ని లైన్లే ఇపుడు చర్చకు వస్తున్నాయి. బాబు అనుభవం ప్రజా సేవ అంటే కచ్చితంగా బాబే ముఖ్యమంత్రి అని చెప్పినట్లు అయింది అని అంటున్నారు.

ఏది ఏమైనా చంద్రబాబు సీఎం అని టీడీపీ శ్రేణులూ చెబుతున్నాయి. పొత్తు తరువాత పవన్ పార్టీలో ఉన్న వారు కూడా ఎన్నికల తరువాత ఏమైనా అని అంటున్నారు. అయితే జనసేన క్యాడర్ కి మాత్రం ఈ విషయం అర్థమైందా అన్నదే ప్రశ్న. వారు అర్ధం చేసుకుని చంద్రబాబు సీఎం కావాలని తపనతో పనిచేస్తే మాత్రం ఈ పొత్తు సూపర్ హిట్ అవుతుంది. లేకపోతే వేరేగా చెప్పాల్సింది లేదు అని అంటున్నారు.

Tags:    

Similar News