నాకో నియోజకవర్గం లేదు...పవన్ షాకింగ్ కామెంట్స్...!
తాను దేశాన్ని చూస్తాను రాష్ట్రాన్ని చూస్తాను అంతే తప్ప ఒక నియోజకవర్గం కోసం చూసుకోలేదు అని ఆయన చెప్పుకొచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లి సభలో చాలా విషయాలు చెప్పారు. అందులో వైసీపీ మీద ఘాటు విమర్శల నుంచి తన సొంత పార్టీ గురించి కూడా చాలా చెప్పేశారు. తాను దేశాన్ని చూస్తాను రాష్ట్రాన్ని చూస్తాను అంతే తప్ప ఒక నియోజకవర్గం కోసం చూసుకోలేదు అని ఆయన చెప్పుకొచ్చారు.
తనకంటూ ఒక నియోజకవర్గం ఉండాలని దాన్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచించలేదని అన్నారు. తాను అన్ని ప్రాంతాల వాడిని కదా అనుకున్నాను అని చెప్పారు. అయితే తన నియోజకవర్గం విషయం తన సొంత పార్టీ వారే చూస్తారు అని కూడా భావించాను అని పవన్ అన్నారు.
కానీ వారూ పెద్దగా ఏమీ చేయలేకపోయారు అని పవన్ అనడమే ఆసక్తిని కలిగిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ వస్తోంది. ఆయన భీమవరం అని పిఠాపురం అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే పవన్ మాత్రం తనకు సొంత నియోజకవర్గం అంటూ లేదని అనడం ఒకింత విస్మయం కలిగించే ప్రకటనగానే ఉంది.
తాను అసలు దాని గురించి ఆలోచించలేదని ఆయన అనడమూ ఆసక్తిని రేపింది. తన గురించి కాకుండా రాష్ట్రం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్లనే ఇలా జరిగింది అని ఆయన అంటున్నారు. మరో విషయం కూడా ఆయన చెప్పారు. తమ పార్టీ బలాలూ బలహీనతలు తనకు తెలుసు అన్నారు. బూత్ లెవెల్ నుంచి పటిష్టంగా టీడీపీ ఉందని తమ పార్టీ మాత్రం అలా లేదని ఆయన వేదిక మీదనే ఉన్న విషయం చెప్పేశారు.
అందుకే ఎక్కువ సీట్లు ఎందుకు పోటీ చేయడంలేదు అన్న దానికి ఇదే తన సమాధానంగా పవన్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఇలా చెప్పినా నెటిజన్ల కామెంట్స్ మాత్రం వ్యతిరేకంగానే వస్తున్నాయి. పదేళ్ల ప్రస్థానం చిన్న విషయం కాదని పార్టీని ఎందుకు నిర్మాణం చేసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
అలాగే ఎంత జాతీయ రాష్ట్ర నేతలు అయినా పోటీ చేయాల్సింది ఏదో ఒక నియోజకవర్గంలోనే కాబట్టి ఆ విధంగా ఎందుకు సొంత సీటు చూసుకుని అభివృద్ధి చేసుకోలేకపోయారు అని కూడా అంటున్నారు. మొత్తానికి తమది చిన్న పార్టీ అని నిధులు వనరులు లేవని పవన్ వేదిక మీద చెబుతూంటే జనసైనికులకు ఎలా ఉందో కానీ నెటిజన్లు మాత్రం ఇన్నాళ్ల విలువైన సమయం ఏమి చేశారు అనే ప్రశ్నిస్తున్నారు.