జైలులో... గొడ్డు అమావాస్య ముహూర్తాన పొడిచిన పొత్తు...!
ఎవరైనా ఏ మంచి పని చేయాలన్నా ముహూర్తాలు మంచివి చూసుకుంటారు. రాజకీయాలలో ఉన్న వారికి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అని కూడా అంటారు
ఎవరైనా ఏ మంచి పని చేయాలన్నా ముహూర్తాలు మంచివి చూసుకుంటారు. రాజకీయాలలో ఉన్న వారికి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అని కూడా అంటారు. వారు ఏ చిన్న పని మొదలెట్టాలన్నా ముహూర్తం బాగా ఉందా లేదా అన్నదే చూసుకుంటారు. అలాంటిది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుని పరామర్శించడానికి వచ్చినట్లుగా వచ్చి జైలు బయట పొత్తుల గురించి సంచలన ప్రకటన చేశారు.
పొత్తు ప్రకటనకు జైలు సరైన వేదిక కాదు అని ఒక వైపు వినిపిస్తున్న వేళ ముహూర్తం కూడా అలాగే ఉందని అంటున్నారు. గొడ్డు అమావాస్య పూట పవన్ టీడీపీతో తన బంధాన్ని గట్టిగా ప్రకటించుకున్నారని అంటున్నారు. దీని ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో ఏ విధంగా దారి తీస్తాయో అని అంటున్నారు.
నిజానికి చూస్తే ఏపీలో ఇంతలా కొంప మునిగిపోయేది ఏదీ లేదు. చంద్రబాబు జైలులో ఉన్నా బెయిల్ మీద త్వరలోనే వస్తారు. అపుడు మంచి రోజు ముహూర్తం చూసుకుని అటు చంద్రబాబు ఇటు పవన్ మీడియాను పిలిచి మరీ పొత్తుల గురించి ఎంచక్కా ప్రకటన చేయవచ్చు ఏపీలో ఎన్నికలు చూస్తే వచ్చే ఏడాది మే లో కానీ జరగవు. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే తొమ్మిది నెలల సమయం బిగిసి ఉంది.
మరి ఈ మధ్యలో ఎన్నో ముహూర్తాలు ఉన్నాయి. దాని కంటే ముందు ఎంత అధినేతల మాటను నాయకులు క్యాడర్ వినాలని, వింటారని అనుకున్నా ప్రతీ దాన్ని ప్రజాస్వామ్యయుతంగా చేయాల్సిన అవసరం ఉంది. పవన్ మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆ మధ్య మాట్లాడుతూ పొత్తులు అన్నవి అయితే ఇప్పటికి లేవు, ఒకవేళ ఉంటే అందరితో చర్చించే నిర్ణయం తీసుకుంటామని చెప్పారని గుర్తు చేస్తున్నారు
మరి పవన్ ఎవరితో చెప్పారో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ చంద్రబాబుని జైలులో కలసి వచ్చి ఆవేశపూరితంగా పొత్తుల ప్రకటన చేసారా అన్న చర్చ అయితే వస్తోంది. సరే ఏదో నాటికి పొత్తులు రెండు పార్టీల మధ్య కుదరాలి కాబట్టి పవన్ ఒక అడుగు ముందుకేసి ప్రకటించారు అనుకున్నా దానికి ముహూర్తం మంచి వేళ అయినా చూసుకోరా అని అంటున్నారు.
అసలే చంద్రబాబు జాతకం 2023 ద్వితీయార్ధం నుంచి బాగా ఉండదని చాలాకాలం క్రితమే వేణు స్వామి అనే జ్యోతిష్కుడు చెప్పారని అంటున్నారు. బాబు అరెస్ట్, రిమాండ్ వేళ ఆయన చెప్పిన మాటలు ఆ వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అష్టాదశ శని బాబు జాతకంలో ఉందని, దాని వల్ల న్యాయపరంగా బాబుకు చిక్కులు వస్తాని కూడా వేణుస్వామి చెప్పి ఉన్నారు
జాతకాల మీద నమ్మకం లేని వారి సంగతి పక్కన పెడితే రాజకీయాల్లో ఉన్న వారు ఇలాంటివి బాగా నమ్ముతారు. పైగా వేణు స్వామి చెప్పినట్లుగానే బాబు ఇపుడు న్యాయపరంగా ఇబ్బందులలో ఉన్నారు. అలాంటి వేళ ఏమి చేసినా చూసుకుని చేయాలి కదా అని అంటున్నారు ఇపుడు గొడ్డు అమావాస్యతో పవన్ పొత్తుల ప్రకటన చేశారు ఏమవుతుందో అన్నది జ్యోతీష్య పండితులే చెప్పాలని కూడా అంటున్నారు.
అయితే చంద్రబాబు పవన్ ల పొత్తు కొత్తది కాదని, 2014లోనే అది కుదిరిందని, హిట్ అయిందని, మధ్యలో వేరుగా ఉన్నా అభిప్రాయ భేదాలే తప్ప మరోటి కాదని అంటున్నారు సో ఇది పాత పొత్తుని కొత్తగా చెప్పడం కాబట్టి ఏ రకమైన ఇబ్బందులు ఉండవని మరి కొందరు అంటున్నారు.
ఏది ఏమైనా 2024 ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య అయిన వేళ జనసేన కూడా ఈసారి అసెంబ్లీలో తన సత్తా చాటాలని చూస్తున్న వేళ మంచి ముహూర్తాలు చూసుకుంటే బాగుండేది అన్నది హితైషుల భావన. సరే ఎన్ని ముహూర్తాలు చూసుకున్నా ప్రజలే దేవుళ్ళు కాబట్టి వారు కోరుకుంటే ఇవన్నీ పక్కకు పోయి మంచి జరుగుతుంది అన్న వారూ ఉన్నారు. సో చూడాలి మరి.