తెలంగాణాలో పవన్ ప్రచార పదనిసలు... పంచులేవీ పవర్ స్టార్...?
ఆయన నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాలలో ప్రచారం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ని విమర్శించడంలేదు, అలాగే అధికార బీయారెస్ ని కూడా ఒక్క మాట అనడంలేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం తెలంగాణాలో జోరుగా సాగుతోంది. ఆయన నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాలలో ప్రచారం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ని విమర్శించడంలేదు, అలాగే అధికార బీయారెస్ ని కూడా ఒక్క మాట అనడంలేదు.
సామాజిక తెలంగాణా రావాలని ఆయన నినదిస్తున్నారు. బీసీ సీఎం అని బీజేపీ పేర్కొందని, అందువల్లనే తాను బీసీ ముఖ్యమంత్రి తెలంగాణాకు రావాలని మద్దతుగా మాట్లాడుతున్నానని పవన్ చెబుతున్నారు. ఆయన ప్రసంగాలు జనరలైజ్ చేస్తూ సాగుతున్నాయి. తెలంగాణా రాజకీయాల్లో ఏపీ ప్రస్తావన తెస్తున్నారు.
ఆయన తన సభలలో జగన్ ప్రస్తావన పదే పదే తేవడాన్ని కూడా అంతా గుర్తు చేస్తున్నారు. ఇక పవన్ ప్రచారం చప్పగా ఉందని అంటున్న వారూ ఉన్నారు. ఎన్నికల వేళ ప్రసంగాలలో కనిపించే ఫైర్ ఏదీ పవన్ అని అంటున్నారు. బీజేపీ నేతలు అటు కాంగ్రెస్ ని ఇటు బీయారెస్ ని విమర్శిస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ అయితే బీయారెస్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుని పడుతోంది. రేవంత్ రెడ్డి స్పీచ్ లలో పంచ్ లు పేలుతున్నాయి. అలాగే కేసీయార్ స్పీచ్ అయితే అగ్గ్రెసివ్ మోడ్ లో సాగుతోంది. కేటీయార్ హరీష్ రావు ప్రత్యర్ధులను తన ప్రసంగాలతో హడలెత్తిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ స్పీచ్ చూస్తే మాత్రం కీలక ప్రత్యర్ధులను ఒక్క మాట అనకుండా సాగుతోంది అని అంటున్నారు
పవన్ ఎందుకు బీయారెస్ మీద విమర్శలు చేయడం లేదు అన్న ప్రశ్న కూడా వస్తోంది. అలాగే కాంగ్రెస్ ని కూడా ఆయన విమర్శించడంలేదు. పైగా కొత్తగూడెం సభలో తనకు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వి హనుమంతరావు లాంటి వారు మిత్రులు అన్నారు. అలాగే కేసీయార్ కేటీయార్ అందరితో మంచి స్నేహం ఉందని చెప్పుకున్నారు. అయినా రాజకీయాల్లో మాత్రం సిద్ధాంతాలే ఉంటాయని కూడా అన్నారు.
మరి అలాంటి సిద్ధంతాలు ఉన్నపుడు గట్టిగానే ఫైట్ చేయాలి కదా అన్న సూచనలు వస్తున్నాయి. అయితే తెలంగాణాలో బీజేపీకి అనుకున్న ఊపు లేకపోవడంతో పాతు వస్తే బీయారెస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న సూచనలు ఉన్నాయి. దాంతో ఈ రెండు పార్టీలకు చెడ్డ కాకుండా పవన్ సేఫ్ జోన్ లో ఉంటూ ప్రసంగాలు చేస్తున్నారు అని అంటున్నారు.
మరి బీజేపీ అయితే పవన్ కళ్యాణ్ మీద చాలానే హోప్స్ పెట్టుకుంది. ఎన్నికల సభలో సూక్తిముక్తావళి వల్లిస్తే పని అవుతుందా అన్నదే కమలనాధుల బాధగా ఉందని అంటున్నారు. అలాగే మెత్తగా సుతిమెత్తగా మాట్లాడితే మెసేజ్ జనాలకు చేరదు కదా అని అంటున్నారు. కానీ పవన్ మీటింగ్స్ కి రావడమే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది. దాంతో ఆయన ప్రచారం వల్ల ఎంతో కొంత ఓట్లు వచ్చినా లాభమే అన్నట్లుగా బీజేపీ నేతలు సర్దుకుని పోతున్నారు.
ఇక పవన్ ప్రచారం మొదలెట్టిందే చివరాఖరులో. అందులో కూడా ఆయన సీరియస్ గా ప్రచారం చేయాల్సింది ఉండగా మధ్యలో రెండు రోజుల పాటు విశాఖ షెడ్యూల్ పెట్టుకున్నారు. విశాఖలో మత్స్యకారులకు ఆర్ధిక సాయం చేయాలంటే పార్టీ వారి ద్వారా ఇప్పించవచ్చు కదా అన్న మాటా ఉంది. విలువైన సమయంలో ప్రచారం చేయాల్సి ఉందని, ప్రతీ క్షణం కూడా లెక్కబెట్టుకోవాల్సి ఉందని అంటున్నారు.
కానీ పవన్ కి తెలంగాణా కంటే ఏపీయే ఎక్కువ మక్కువ ఉందని అంటున్నారు. అందుకే ఆయన తెలంగాణాలో జగన్ గురించి మాట్లాడుతూ ప్రత్యర్ధులను పక్కన పెట్టేస్తున్నారు అని అంటున్నారు. పవన్ ప్రచార పదనిసల వల్ల కాషాయం పార్టీకి దక్కే ఫలం ఎంత జనసేనకు దక్కే ఓట్లు సీట్లూ అన్నది మాత్రం డిసెంబర్ 3న తెలుస్తుంది అని అంటున్నారు.