బీజేపీని కూటమిలోకి పవన్ తేగలరా.. కమలంతో పొత్తు ఎందుకు...!?

ఏపీలో టీడీపీ జనసేన కూటమి సెట్ అయి నెలలు గడుస్తున్నాయి. అయినా అభ్యర్థుల సంగతి తేలడంలేదు.

Update: 2024-01-15 16:30 GMT

ఏపీలో టీడీపీ జనసేన కూటమి సెట్ అయి నెలలు గడుస్తున్నాయి. అయినా అభ్యర్థుల సంగతి తేలడంలేదు. దానికి కారణం బీజేపీని కూడా కలుపుకుని పోవాలని రెండు పార్టీలకు ఉండడమే అంటున్నారు. బీజేపీ ఉంటే ఆ లెక్కే వేరు కిక్కే వేరు అని అంటున్నారు.

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దాంతో ఎన్నికల వేళ ఎలక్షనీరింగ్ కి ఆ పార్టీ మద్దతు విశేషంగా ఉపయోగపడుతుంది అని కూటమి పెద్దలు భావిస్తున్నారుట. ఇక 2024 ఎన్నికల తరువాత బీజేపీ మరోసారి అధికారంలోకి రావచ్చు అని అంచనాలు కూడా ఉన్నాయి. కేంద్రంలో గెలిచే పార్టీతో సఖ్యతగా ఉంటే ఏపీ లాంటి అప్పుల కుప్ప అయిన రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు అని భావిస్తున్నారు.

దాంతో చంద్రబాబు పవన్ ల భేటీలో బీజేపీని కూడా కలుపుకుని పోవాలని ప్రతిపాదన వచ్చింది అని అంటున్నారు. బీజేపీకి కావాల్సిన సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని కూడా కమలం పార్టీ పెద్దలకు వినిపించాలని నిర్ణయించారు.

ఈ మేరకు కూటమిలోకి బీజేపీని ఆహ్వానించే బాధ్యతను ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేన మీదనే టీడీపీ పెట్టింది. దాంతో తొందరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో పొత్తుల గురించి చర్చిస్తారు అని అంటున్నారు. బీజేపీకి ఏపీ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంది. అయినా సరే పవన్ మిత్రుడిగా అంతా వివరించి ఆ పార్టీని కూటమిలో చేరేలా ఒప్పిస్తారు అని అంటున్నారు.

ఇక బీజేపీకి కనీసంగా అరడజన్ ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. వీలైతే మరో ఒకటి రెండు పెంచినా పెంచవచ్చు అంటున్నారు. అలా బీజేపీని తమ మిత్రుడిగా చేసుకోవాలని చూస్తున్నారుట.

ఎందుకు అంటే బీజేపీ అవసరం ఎన్నికల అనంతరం కూడా ఉంటుందని అంటున్నారు. ఎలా చూసుకున్నా ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయని అంటున్నారు. ఎన్నికల తరువాత అనుకోని సంఘటనలు జరిగినా లేక రాజకీయ కుదుపులు జరిగినా కేంద్రంలోని పెద్దన్నగా బీజేపీ శ్రీకృష్ణుడి పాత్రలో ఉంటూ తమ వైపు మద్దతుగా నిలిస్తే అది ఎంతో మేలు చేస్తుందని తలపోస్తున్నారుట.

ఒకవేళ అరకొర మెజారిటీలు వచ్చి అధికారంలోకి వచ్చినా కూడా ఆయా ప్రభుత్వాల స్థిరత్వం కావాలంటే కూడా కేంద్ర పెద్దల సాయం కావాలి. ఇలా అన్నీ ఆలోచించే బీజేపీ మద్దతు కోరుకుంటున్నారు అని అంటున్నారు. బీజేపీ మద్దతు ఉంటే ఎన్నికల తరువాత ఆపరేషన్ అపోజిషన్ కూడా స్టార్ట్ చేయవచ్చు అన్న ఏవేవో ఆలోచనలు కూడా తెర వెనక ఉన్నాయని అంటున్నారు.

అయితే సీపీఐ మాత్రం దీన్ని తప్పుపడుతోంది. బీజేపీకి ఏపీలో ఏముందని ప్రశ్నిస్తోంది తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఒంటరిగా బీజేపీని ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కూడా బీజేపీని వదిలేసి అలాగే చేయాలని ఆయన కోరుతున్నారు. ఇండియా కూటమి తో జట్టు కట్టాలని సలహా ఇస్తున్నారు. మరి బీజేపీ ఏమంటుందో కూడా చూడాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News