బాబుతో మరోసారి పవన్ ములాఖత్!
ఆ రోజు మధ్యాహ్నం బాబుతో ములాఖత్ అయిన వెంటే పవన్ లోకేష్ కూర్చుని అనేక అంశాలు రెండు పార్టీల తరఫున కో ఆర్డినేషన్ మీటింగ్ మెంబర్స్ తో చర్చిస్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ములాఖత్ అవుతున్నారు. అది కూడా దాదాపుగా నలభై రోజుల తరువాత. గత నెల 14న రాజమండ్రి జైలులో చంద్రబాబుని పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ. లోకేష్ ములాఖత్ ద్వారా కలిశారు.
ఆ తరువాత బయటకు వచ్చిన వెంటనే పవన్ టీడీపీతో పొత్తులు అంటూ కీలక ప్రకటన చేశారు. బాబు వెంటనే బయటకు వచ్చేస్తారు అని నాడు అంతా అనుకున్నారు. కానీ మరో నలభై రోజులు ఇట్టే సాగిపోయాయి. బాబు మాత్రం జైలులోనే ఉండిపోయారు. దాంతో టీడీపీ జనసేన పొత్తును ముందుకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం పడుతోంది. దాంతో పవన్ తో పాటు లోకేష్ కూడా బాబుతో ములాఖత్ అయి ఉమ్మడి కార్యాచరణ విషయంలో మాట్లాడుతారు అని అంటున్నారు.
బాబు ఈ ఇద్దరు నేతలకూ దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు. ఇక ఈ నెల 23న విజయదశమి. ఆ రోజు మధ్యాహ్నం బాబుతో ములాఖత్ అయిన వెంటే పవన్ లోకేష్ కూర్చుని అనేక అంశాలు రెండు పార్టీల తరఫున కో ఆర్డినేషన్ మీటింగ్ మెంబర్స్ తో చర్చిస్తారు. అనంతరం ఏపీవ్యాప్తంగా రెండు పార్టీలు ఎలా చేయాలి, ఏ విధంగా ఉమ్మడిగా ముందుకు సాగాలి అన్నది చర్చింది ఒక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే గతసారి బాబుని జైలులో కలసిన అనంతరం పవన్ సంచలన ప్రకటన పొత్తుల విషయంలో చేశారు. మరి ఈసారి పవన్ నుంచి అలాంటి సంచలన ప్రకటన ఆశించవచ్చునా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక గతసారి బాబుతో ములాఖత్ అయినపుడు బాలయ్య కూడా వెంట ఉన్నారు. ఈసారి బాలయ్య అయితే కనిపించడం లేదు. బాలయ్యను కూడా కలుపుకుని పోతారా లేదా అన్నది కూడా చర్చకు వస్తోంది.
ఇంకో వైపు చూస్తే చంద్రబాబు పవన్ లోకేష్ లకు ఏ విషయాల్లో దిశా నిర్దేశం చేస్తారు అన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. తెలంగాణా ఎన్నికల్లో బీజేపీతో కలసి నడవాలని జనసేన చూస్తోంది. ఈ మధ్య కాలంలో ఇది కీలకమైన రాజకీయ పరిణామం గా ఉంది. మరి దీని మీద కూడా బాబు తన అభిప్రాయాన్ని పంచుకుంటారా అన్నది చూడాలి.
అలాగే తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ పోటీ విషయం కూడా ఏదో ఒకటి తేలేది కూడా ఈ ములాఖత్ ద్వారానే అని అంటున్నారు. మొత్తానికి బీజేపీ జనసేన పొత్తులు తెలంగాణా ఎన్నికల్లో పెట్టుకుంటే టీడీపీ కూడా ఆ పొత్తులతో జత కలుస్తుందా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇక నారా భువనేశ్వరి ఏపీ వ్యాప్తంగా చేసే టూర్ లో పవన్ కూడా కనిపించేలా ఏమైనా ప్లాన్ చేశారా టీడీపీకి పవన్ సపోర్టు ఎంతవరకూ ఇస్తారు, బాబు ఏమేమి కోరుతారు అన్నది కూడా ఈ ములాఖత్ ద్వారా తేలనుంది అని అంటున్నారు.