ఈ దెబ్బతో.. ఆ సెంటిమెంట్‌ బ్రేక్‌!

సాధారణంగా సెంటిమెంట్లు అందరికీ ఉంటాయి. దీనికి ఎవరూ, ఏ రంగం వారైనా అతీతులు కాదు.

Update: 2024-06-13 09:38 GMT

సాధారణంగా సెంటిమెంట్లు అందరికీ ఉంటాయి. దీనికి ఎవరూ, ఏ రంగం వారైనా అతీతులు కాదు. ముఖ్యంగా ఎన్నికల్లో సెంటిమెంట్ల ప్రభావం చాలా ఎక్కువే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. కూటమి ధాటికి ఫ్యాన్‌ పార్టీ వైసీపీ కకావికలమైంది. 11 స్థానాలకే పరిమితమై రాష్ట్ర చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

కాగా ఈ ఎన్నికల్లో ఎప్పటి నుంచో ఉన్న సెంటిమెంట్లు బద్దలయ్యాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంటు చాలా కాలంగా కొనసాగుతోంది. 2004, 2009, 2019ల్లో ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ గెలుపొందారు. రాష్ట్రంలో మాత్రం 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీ, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

1999, 2014 ఎన్నికల్లో ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పరాజయం పాలయ్యారు. కానీ ఈ రెండుసార్లు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇలా ఒకటి, రెండు కాదు.. ఐదు ఎన్నికల్లో ఉరవకొండ సెంటిమెంటు కొనసాగడంతో ఈసారి అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రాదనే చర్చ జరిగింది.

అయితే అనూహ్యంగా ఈ 2024 ఎన్నికల్లో ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ సెంటిమెంటును బ్రేక్‌ చేశారు. ఆయన ఈ ఎన్నికల్లో అక్కడ నుంచి మరోసారి విజయం సాధించారు. రాష్ట్రంలోనూ టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఉరవకొండ సెంటిమెంటుకు ఎట్టకేలకు ఐదు సార్వత్రిక ఎన్నికల తర్వాత బ్రేక్‌ పడింది.

కాగా పయ్యావుల కేశవ్‌ ఉరవకొండ నుంచి తొలిసారిగా 1994లో మొదటిసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు రాష్ట్రంలో కూడా టీడీపీనే అధికారంలోకి వచ్చింది. అయితే 1999 ఎన్నికల నుంచి ఈ లెక్క తప్పింది.

ఈ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి గెలుపొందిన పయ్యావుల కేశవ్‌ గతంలో 1994, 2004, 2009, 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన 1999, 2014 ఎన్నికల్లో పయ్యావుల ఓటమి పాలయ్యారు.

తాజా ఎన్నికల్లో పయ్యావుల కేశవ్‌ 21 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. అంతేకాకుండా మంచి వాగ్దాటి, సబ్జెక్టుపై పట్టు ఉన్న నేతగా పేరు తెచ్చుకోవడంతో చంద్రబాబు తాజా కేబినెట్‌ లో మంత్రిగానూ చోటు దక్కించుకున్నారు.

Tags:    

Similar News