జగన్ కు టీడీపీ నేత నుంచి ఆసక్తికర రిక్వస్ట్!
అవును... ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ నేడు శాసనసభా వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పయ్యావుల కేశవ్.
ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ ఆల్ మోస్ట్ పూర్తి చేసిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ శాసన సభా వ్యవహారాల మంత్రి నుంచి వైసీపీ అధినేత జగన్ కు ఆసక్తికరమైన ఆహ్వానం అందింది.
అవును... ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ నేడు శాసనసభా వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పయ్యావుల కేశవ్. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైలుపై తన తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన పయ్యావుల కేశవ్.. అనంతరం శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు జవాబుదారీ తనంతో కూడిన పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసమే సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ సభకు రావాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది.
అయితే... స్వపక్షమైనా, విపక్షమైనా తామే అని చెప్పిన పయ్యావుల.. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా తాము సిద్దంగా ఉంటామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.