నోరూరించే పీచుమిఠాయి బ్యాన్ ఎందుకో తెలిస్తే వణుకే
చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరి మనసుల్ని దోచే పీచు మిఠాయితో జరిగే నష్టం ఎంతన్న విషయాన్ని తెలియజేసేలా తమిళనాడు ప్రభుత్వం తాజాగా పీచు మిఠాయి మీద బ్యాన్ విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే వేళలో కనిపించే పీచుమిఠాయిని చూసినంతనే.. కొనాలన్న భావన మనసులోకి వచ్చేస్తుంది. పిల్లలు అయితే దాన్ని కొనే వరకు వదలరు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరి మనసుల్ని దోచే పీచు మిఠాయితో జరిగే నష్టం ఎంతన్న విషయాన్ని తెలియజేసేలా తమిళనాడు ప్రభుత్వం తాజాగా పీచు మిఠాయి మీద బ్యాన్ విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఆహార భద్రతా శాఖ సిఫార్సుతో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.
నోట్లో వేసుకున్నంతనే కరిగిపోయే పీచుమిఠాయిలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని.. వాటితో ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. ఇటీవల పుదుచ్చేరి బీచ్ లో అమ్మే పీచు మిటాయి పాకెట్లను స్వాధీనం చేసుకున్న ఆ రాష్ట్ర ఆహార భద్రతా శాఖ అధికారులు.. వాటి శాంపిళ్లను పరిశోధనలు కోసం ల్యాబ్ కు పంపారు. క్యాన్సర్ కు కారకమైన 'రొడమైన్ బి' అనే రసాయనం పీచుమిఠాయిలో కలుపుతున్నట్లుగా టెస్టుల్లో బయటకు వచ్చింది.
దీంతో స్పందించిన పుదుచ్చేరి ప్రభుత్వం పీచు మిఠాయి మీద తాత్కాలిక బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని మెరీనా బీచ్ లో అమ్ముతున్న పీచు మిఠాయి పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షలకు పంపారు. అక్కడ కూడా పుదుచ్చేరి రిపోర్టు మాదిరే నివేదిక రావటంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఆహార భద్రతా శాఖ సిఫార్సుతో తమిళనాడులోనూ పీచుమిఠాయి మీద బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘించి పీచుమిఠాయి అమ్మితే కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా పరిణామాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా అమ్మే పీచుమిఠాయి పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వెంటనే పీచుమిఠాయి శాంపిళ్లను సేకరించి.. ల్యాబ్ ల్లో టెస్టు చేయించాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేదిగా తేలినపక్షంలో వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఒక తమిళనాడుకు చెందిన ఆహార భద్రతా శాఖ అధికారి పీచు మిఠాయిపై షాకింగ్ అంశాల్ని వెల్లడించారు.
'రొడమైన్ బి' రసాయం జౌళి రంగానికి సంబంధించిన వాటిల్లో వినియోగిస్తారని.. ఈ కెమికల్ ను పీచు మిఠాయిలోనూ వాడుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. సాధారణంగా తినుబండారాల్లో ఉండే ఇతర రసాయనాలు 24 గంటల్లో యూరినస్ ద్వారా బయటకు వెళ్లిపోతాయన్నారు. కానీ.. రొడమైన్ బి మాత్రం అందుకు భిన్నమని.. ఇది శరీరంలోకి చేరిన తర్వాత అది బయటకు వెళ్లేందుకు పట్టే సమయం ఏకంగా 45 రోజులుగా పేర్కొన్నారు.
ఈ కెమికల్ కిడ్నీ.. కాలేయం.. నాడీ వ్యవస్థతో పాటు మెదడు తదితరాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. శరీరానికి రక్షణగా నిలిచే పరమాణువులను నిర్వీర్యం చేసి.. ఆరోగ్య వ్యవస్థను దెబ్బ తీస్తుందని చెబుతున్నారు. తియ్యగా.. నోట్లో వేసుకున్నంతనే ఇట్టే కరిగిపోయే పీచు మిఠాయిలో ఇంత డేంజరా? అన్నదిప్పుడు షాకింగ్ గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి.. పరీక్షలు జరిపి వాస్తవాలు ఏమిటన్న దానిపై ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.