పరువు నష్టం దావా వేస్తా.. ‘పెద్దాయన’ హాట్‌ కామెంట్స్‌!

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలిచారు

Update: 2024-08-15 21:30 GMT

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలిచారు. రాయలసీమలో పెద్దాయనగా, ప్రభుత్వంలో జగన్‌ తర్వాత నంబర్‌ టూగా ఆయన హవా చెలాయించారు. రాయలసీమలో ఉన్న మొత్తం 52 అసెంబ్లీ స్థానాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినవారికే జగన్‌ సీట్లు కేటాయించారు. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని పెద్దిరెడ్డి నాడు భీకర సవాళ్లే చేశారు. అయితే చివరకు పెద్దిరెడ్డే చచ్చీచెడి గెలవాల్సి వచ్చింది. రాయలసీమలో వైసీపీ కేవలం ఏడు సీట్లకే పరిమితమైంది.

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో సాగించిన అరాచకాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తమ భూములను పెద్దిరెడ్డి అనుచరులు, కుటుంబ సభ్యులు, బంధువులు దోచుకున్నారని పెద్ద ఎత్తున ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ముఖ్యంగా గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా జగన్‌ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించిన పెద్దిరెడ్డి మైనింగ్, ఇసుక తవ్వకాల్లో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఆయనకు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది.

ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తప్పులను ఎల్లో మీడియా దాచేస్తోందని మండిపడ్డారు. తమపై పనిగట్టుకుని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

తమపై అసత్య ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటానని పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే లీగల్‌ నోటీసులు ఇచ్చానని తెలిపారు. త్వరలో పరువు నష్టం దావా కూడా వేస్తామని చెప్పారు. కాగా తనకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని అందితే సమాధానం ఇస్తానని తెలిపారు.

సీఎం చంద్రబాబు పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని పెద్దిరెడ్డి తెలిపారు. రెండు నెలల్లోనే ఆరోగ్యశ్రీకి 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) తీసుకొస్తామని చెబుతున్నారన్నారు. రానున్న రోజుల్లో పేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఫీజు చెల్లించి వైద్యం తీసుకునే పరిస్థితి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఓవైపు గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా వ్యవహరించిన ఆయనపై ఎర్రచందనం అక్రమ ర వాణాకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఇంకోవైపు మైనింగ్‌ అక్రమ తవ్వకాలు, వేలాది ఎకరాల భూముల కబ్జాకు సంబంధించి టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో పెద్దిరెడ్డి చుట్టూ ప్రభుత్వం పెద్ద ఉచ్చునే బిగిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags:    

Similar News