మదనపల్లె కేసులో బాబు హడావిడి అందుకేనట.. పెద్దిరెడ్డి వెర్షన్ ఇది!
మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దగ్దం కేసు ఇటీవల కాలంలో ఎంత సంచలనమైందనే సంగతి తెలిసిందే.
మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దగ్దం కేసు ఇటీవల కాలంలో ఎంత సంచలనమైందనే సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇదంతా పెద్దిరెడ్డి & కో పనే అన్నట్లుగా కూటమి పార్టీల నేతల ఆరోపణల నేపథ్యంలో... ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి! ఈ నేపథ్యంలో తాజాగా పెద్దిరెడ్డి స్పందించారు.
అవును... మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్దం కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం నేతలు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆయన వాపోయారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మదనపల్లె ఫైళ్లు దగ్ధం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని.. అయితే చంద్రబాబు మాత్రం రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచీ తనకు వ్యతిరేకంగానే పనిచేశారని ఆరోపించారు.
ఇదే సమయంలో వాస్తవాలతో సంబంధం లేకుండా తమ క్యారెక్టర్లను దెబ్బ తీసే విధంగా చంద్రబాబు తన అనుకూల పత్రికల్లో అవాస్తవాలు రాయిస్తున్నారని.. తమ కుటుంబంపైనా అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.. అందులో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తూ, అసత్య కథనాలు రాయిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే తమపై కొన్ని టీవీ చానాళ్లు అత్యుత్సాహంతో తమ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని.. వీటిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఈ కేసును సీఐడీకి అప్పగించినా, సీబీఐకి అప్పగించినా తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. ఆ కేసుకు తనకూ ఎటువంటి సంబంధం లేదని పెద్దిరెడ్డి వెల్లడించారు.
కేవలం ఎన్నికల హామీలు నెరవేర్చలేక చంద్రబాబు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇవని.. అసలు సూపర్ సిక్స్ అంటేనే ఆయన భయపడిపోతున్నారని.. ఖజానాలో డబ్బులు లేవంటూ సాకులు వెతుక్కుంటున్నారని అన్నారు. ఏది ఏమైనా ఈ కుట్రలన్నింటినీ ఎదుర్కొంటామని, తమపై పెట్టిన కేసులు తప్పని నిరూపిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
కాగా... మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన దస్త్రాల దహనం కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వ్యులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ కేసును మదనపల్లె పోలీసులు రెండు రోజుల్లోగా సీఐడీకి అప్పగించనున్నారని తెలుస్తోంది.