పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు:... మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవ్వడంతో ఏపీలో ఎన్నికల వేడి మరింతగా పెరుగుతుంది

Update: 2024-04-19 04:39 GMT

నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవ్వడంతో ఏపీలో ఎన్నికల వేడి మరింతగా పెరుగుతుంది. ఈ క్రమంలో రాజంపేట బీజేపీ లోక్ సభ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి - వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రోజురోజుకీ మాటల యుద్ధం పీక్స్ కి చేరుకుంటుంది. ఈ క్రమంలో నిన్నటివరకూ పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో కిరణ్ కుమార్ పై ఆరోపణలు చేయగా.. తాజాగా మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... మాజీ సీఎం, రాజంపేట లోక్‌ సభ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి... పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారని ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ సీరియస్ అయ్యారు. తాను ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టనని చెప్పుకొచ్చారు! ఇదే క్రమంలో పదవుల కోసం పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై తాను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పద్మావతి గెస్ట్ హౌస్‌ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు రెండు సార్లు పట్టుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో తన నియోజకవర్గ 50 మంది కార్యకర్తలు అక్కడే ఉన్నారని తెలిపారు.

ఈ క్రమంలో... తాను మంత్రి పదవిని మాత్రమే ఆశించినట్లు చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి... ప్రభుత్వ విప్ అయ్యానని.. అటు తర్వాత శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి పదవులు దక్కాయని.. ఇలా అనుకోకుండా అన్ని పదవులు పొందానని వివరించారు. తన కాళ్లు పట్టుకున్న విషయంలో... కాణిపాకం లేదా తరిగొండలో ప్రమాణానికి సిద్ధమా..? అని ఈ సందర్భంగా పెద్దిరెడ్డిని ప్రశ్నించారు.

కాగా... ఇటీవల పుంగనూరులో మాట్లాడిన పెద్దిరెడ్డి.. వైఎస్ జగన్‌ ను కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో వేధించారని.. జైలుకు పంపారని.. ఆంధ్రప్రదేశ్‌ కి ప్రత్యేక హోదా రాకపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని.. రాష్ట్ర విభజనకూ ఆయనే కారణమని.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి బీజేపీలో చేరిన చరిత్ర ఆయనదని.. సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాంతానికి నీరు కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

Full View
Tags:    

Similar News