రాజన్న దొరకు నో చెప్పిన జగన్...!?
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పీడిక రాజన్నదొర ఒక చిరకాల కోరికను జగన్ ముందుంచారుట
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పీడిక రాజన్నదొర ఒక చిరకాల కోరికను జగన్ ముందుంచారుట. కానీ జగన్ మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించి పక్కన పెట్టారు అని ప్రచారం సాగుతోంది. ఇంతకీ రాజన్న దొర కోరిక ఎంటి జగన్ ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
సాలూరు నియోజకవర్గాన్ని గత రెండు దశాబ్దాలుగా శాసిస్తున్న పీడిక రాజన్నదొర ఇప్పటికి నాలుగు సార్లు గెలిచారు. ఆయన అంటేనే సాలూరు, ఆయన ఉంటేనే సాలూరు అన్నది జనంలో ఉన్న మాట. రాజన్నదొర వీర విధేయుడుగా వైఎస్సార్ ఫ్యామిలీకి ఉంటూ వచ్చారు. ఆయనను 2014 నుంచి 2019లో టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు ఫిరాయించమని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా జగన్ వైపే ఉన్నారని ప్రచారం ఉంది.
దానికి ప్రతిఫలంగా జగన్ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే రాజన్నదొర మంత్రి పదవి కోరిక ఈసారితో తీరిపోయింది. దాంతో ఆయన ఒకసారి అయినా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీ చట్టసభలో తన వాణిని వినిపించాలని ఉబలాట పడ్డారు.
ఆయన చాలా కాలం క్రితమే జగన్ చెవిన ఇదే విషయాన్ని వేశారుట. ఒక దశలో జగన్ కూడా ఆయన్ని అరకు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచించారని టాక్. అయితే అనూహ్యంగా పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని అరకు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించనున్నారు.
దాంతో పాటు రాజన్నదొరనే మరోసారి సాలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని వైసీపీ హై కమాండ్ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి హోరా హోరీ పోరు ఉంటుంది కాబట్టి ప్రతీ ఎమ్మెల్యే సీటూ చాలా కీలకం కాబోతోంది. దాంతో కచ్చితంగా చేతిలో పడే సీటు సాలూరు విషయంలో రాజన్నదొరను వదులుకుని రిస్క్ చేయడం ఎందుకు అని భావించి ఆయననే మళ్లీ బరిలోకి దించుతున్నారు అని అంటున్నారు.
దీంతో రాజన్నదొర అధినాయకత్వం మాటను మన్నించి ఐదవసారి సాలూరు నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీ చేయనున్నారు. అదే సమయంలో అరకు ఎంపీ సీటుని గెలిపించే బాధ్యతను కూడా ఆయన భుజాన వేసుకున్నారు. ఇటీవల తన క్యాంప్ ఆఫీసుకు వచ్చిన పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మికి ఈ మేరకు రాజన్నదొర హామీ ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి రాజన్నదొరకు ఎంపీ అయ్యే లక్ ఉందా లేదా అన్నది ఫ్యూచర్ లో అయినా తేలుతుందా అన్నది చూడాల్సి ఉంది.