జోరు వర్షంలోనూ కొనసాగుతున్న చంద్రబాబు హామీ!
ఏపీలో ప్రతినెలా 1న జరిగే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబరు నెలకు సంబంధించి ఒక రోజు ముందుకు జరిపారు.
ఏపీలో ప్రతినెలా 1న జరిగే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబరు నెలకు సంబంధించి ఒక రోజు ముందుకు జరిపారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ఆగస్టు 31నే పింఛన్లను పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే.. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జోరు వర్షాలు పడుతున్నాయి. అయినా.. కూడా పింఛన్ల పంపిణీ ఆపరాదని చంద్రబాబు ఆదేశించారు. దీంతో నాయకులు సైతం ముందుకు కదిలారు.
స్పీకర్ సహా మంత్రులు..
పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సీఎం చంద్రబాబు ప్రారంభించాలని భావించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే. కర్నూలులో జోరు వర్షం కారణంగా ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన చంద్రబాబు ... తనతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రులకు సూచించారు. దీంతో స్పీకర్ సహా మంత్రులు ఉదయాన్నే గొడుగులు పట్టుకుని.. రంగంలోకి దిగారు.
నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, మంత్రులు తమ తమ జిల్లాల్లో వర్షం తెరిపి ఇచ్చిన చోట పింఛన్ల పంపిణీ చేపట్టారు. శనివారం ఉదయం 9.30 గంటలకే 80 శాతం పింఛన్లు పంపిణీ చేశామని, కొత్తగా అర్హులైన వారికి అక్టోబరు నుంచి పింఛన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
అనర్హులైన వారికి ఈ నెల వరకు పింఛన్లను అందించనున్నట్టు అధికారులు చెప్పారు. అయితే.. వారిని తొలగించే కార్యక్రమం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొన్నికొన్ని జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ.. సిబ్బంది ఆయా ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు వివరించారు. మొత్తానికి వర్షం కురుస్తున్నా.. పింఛన్ల పంపిణీ మాత్రం ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.