తెల్లారింది.. ఒకటో తారీఖు వచ్చింది.. పెన్షన్ రాలేదు!
ప్రస్తుతం ఏపీలో అత్యంత హాట్ టాపిక్స్ లో ప్రధానమైనది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన అంశం అని చెప్పినా అతిశయోక్తి కాదు!
ప్రస్తుతం ఏపీలో అత్యంత హాట్ టాపిక్స్ లో ప్రధానమైనది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన అంశం అని చెప్పినా అతిశయోక్తి కాదు! పైగా ఈ రోజు ఒకటో తేదీ కావడంతో వాలంటీర్లకు సంబంధించిన చర్చ గ్రామాల్లో మరింతగా వినిపిస్తుంది. "రోజూ ఈపాటికి పెన్షన్ ఇచ్చి వెళ్లేవాళ్లు.. ఇంకా రాలేదేంటి" అని అవ్వా తాతలు కనిపించిన ప్రతీ ఒక్కరినీ అడగడం.. "మీరే సచివాలయాలకు వెళ్లి తెచ్చుకోవాలి" అని వాళ్లు చెప్పడం, దీంతో అవ్వాతాతలు సణగడం అనేక చోట్ల దర్శనమిస్తున్న పరిస్థితి అని తెలుస్తుంది.
అవును... సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా అలవాటైన ప్రక్రియ ఒక్కసారిగా అంతకంటే ముందు రోజులకు వెళ్లేసరికి అవ్వాతాతలు తట్టుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఒకటో తేదీన వాలంటీర్ వచ్చీ రాగానే.. బొటన వేలు తుడుచుకుంటూ చిరునవ్వులు చిందించే అవ్వాతాతలు.. ఇప్పుడు సచివాలయాలకు బయలుదేరుతున్నారని తెలుస్తుంది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఈ పరిస్థితి.. అనేది తెలిసిన విషయమే!
వాస్తవానికి వయసు పైబడిన వాళ్లకు ఆరోగ్య సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారిని కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి, గంటల తరబడి నిరీక్షించి, పెన్షన్ తీసుకోమని చెప్పడం ఏమాత్రం న్యాయం కాదని భావించారో ఏమో కానీ... ఇంటింటికీ వెళ్లి పెన్షన్ దారులకు ఇంటివద్దే పెన్షన్ అందించే ఏర్పాటు చేశారు జగన్. దీనికోసం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఈ సమయంలో తన అనుచరులతో, సన్నిహితులతో, సానుభూతిపరులతో కలిసి చంద్రబాబు నేడు ఈ పరిస్థితి తీసుకొచ్చారని.. నేడు ఎండలో పడి సచివాలయాలకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్న ప్రతీ పెన్షన్ దారుడి ఇబ్బందులకూ చంద్రబాబు & కో చేసినపనే కారణమని.. తన పరిపాలనలో పెన్షన్ దారులు పడిన ఇబ్బందులను మరోసారి గుర్తు చేస్తున్నారని.. వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ప్రధానంగా కడుపు నిండిన పెత్తందారులకు, పేదలకూ మద్య జరగనున్న యుద్ధమే రేపు రాబోయే ఎలక్షన్ అని.. అందుకు పేదలంతా "సిద్ధం"గా ఉందాలన్ని వైఎస్ జగన్ పిలుపునిస్తున్న సమయంలో... ఆ వాదనకు బలం చేకూర్చేలా చంద్రబాబు & కో చేసిన ఈ ప్రయత్నం ఉందని, నేడు పెన్షన్ దారులు పడుతున్న ఇబ్బందులకు అదే కారణం అని వైసీపీ నేతలు నొక్కి చెబుతున్నారు.
ఇదే క్రమంలో... తాజాగా మరో నిర్ణయం తెరపైకి వచ్చింది. రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లను ఎంటరవ్వనివ్వొద్దని ఆదేశాలు జారీచేయబడ్డాయి! దీంతో... మునిపటిలా గుమ్మం ముందుకు రేషన్ సరుకులతో నిండిన వెహికల్స్ వచ్చి ఆగే పరిస్థితి ఉండదని.. బియ్యం కోసం సంచులు పట్టుకుని డిపోల వద్ద గుమిగూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని.. దీనికంతటికీ కూడా కారణం చంద్రబాబు & కో చేసిన పనులేనని తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్నారు అధికారపార్టీ నేతలు!
ఇదే సమయంలో తమ వయసున్న చంద్రబాబుకు కూడా తమ సమస్య అర్ధంకాకపొతే ఎలా అని పెన్షన్ దారులు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. వీరికి అసౌకర్యం, అసహనం, అవస్థలు కలగడానికి కారణం అయిన చంద్రబాబుపై రివేంజ్ తీర్చుకుంటారని నేతలు జోస్యం చెబుతున్నారు. ఏది ఏమైనా... సుమారు నాలుగున్నరేళ్లుగా వచ్చి వెళ్లిన ఒకటో తారీఖు ఒక లెక్క అయితే... ఈ ఒకటో తేదీ మరోలెక్క!! దీంతో... "హమ్మయ్య ఒకటో తారీఖు వచ్చేసింది" కాస్తా... సౌండ్ మార్చుకుందని చెబుతున్నారు!