ఒక్క ఏపీలోనే కాదు, ఇండియా లెవెల్ లో కూటములే గెలిచాయా ?
సింగిల్ అంటూ వచ్చిన వారిని పక్కన తొక్కేసి పొత్తుల ఎత్తులతో వచ్చిన వారికే పట్టం కట్టారు.
కూటములకు ఆదరణ బాగా దక్కినట్లుగా తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. అంటే మంది బలం మేలు అన్న నీతిని పార్టీలు పాటిస్తే జనాలు కూడా జై కొట్టారు అని అంటున్నారు. సింగిల్ అంటూ వచ్చిన వారిని పక్కన తొక్కేసి పొత్తుల ఎత్తులతో వచ్చిన వారికే పట్టం కట్టారు.
ఇది ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో కనిపించింది. దానికి కారణం ఒక నాయకత్వం కంటే బహు నాయకత్వం భేష్ అని జనాలు భావించడమే అని అంటున్నారు. పది మంది ఆలోచనలు కలిస్తే మంచి పాలన వస్తుందని కూడా ఆలోచించి ఉండవచ్చు అని విశ్లేషిస్తున్నారు.
నలుగురూ కలిస్తే ఆ బలం కూడా పాలనలో మేలైన నిర్ణయాలకు దోహదపడుతుందని పటిష్టమైన ప్రభుత్వాల స్థాపనకు దారి తీస్తుంది అని జనం భావించే ఓటెత్తారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే జనాలు వారికే ఓట్లు వేశారు. టీడీపీ జనసేన కూటమిలో చివరిలో బీజేపీ వచ్చి చేరింది.
అలా ఈ మూడు పార్టీల వల్ల ఏపీకి మేలు జరుగుతుందని జనాలు భావించారు అని అంటున్నారు. దాంతో ఏపీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా మొత్తం175 సీట్లకు 164 సీట్లను కూటమికి కట్టబెట్టడం జరిగింది. అలాగే పాతిక ఎంపీలు ఉంటే 21 కూటమికే దక్కాయన్నది ఇక్కడ చూడాలి. ఇది కూటమి పట్ల జనాలకు పెరిగిన విశ్వాసానికి తార్కాణం అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే దేశంలో చాలా కూటములు గెలిచాయి. పక్కనే ఉన్న తమిళనాడులో కూడా డీఎంకే కూటమి ఈసారి ఎన్నికల్లో మొత్తానికి మొత్తం 39 ఎంపీ సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకే తమిళ జనం నీరాజనం పట్టారు.
దాంతో అన్నాడీఎంకే కానీ సింగిల్ గా వచ్చిన బీజేపీ కానీ జనాదరణను పొందలేకపోయాయని అంటున్నారు. ఇదే తీరున మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ కలసి కట్టిన కూటమికి జనాలు విశేష ఆదరణ అందించారు. మొత్తం 48 ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లను ఈ కూటమి గెలుచుకుని బీజేపీ కూటమికి షాక్ ఇచ్చేసింది. అంటే ఇక్కడ ప్రతిపక్ష కూటమి వైపు జనాలు మొగ్గు చూపారు అని భావించాలి.
అలాగే కేరళలో చూస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కి జనాలు ఎర్ర తివాచీని పరచారు. మొత్తం 20 ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లు యూడీఎఫ్ కూటమికే దక్కాయి. బీజేపీ ఒకే ఒక్క సీటుకు పరిమితం అయింది. అది కూడా ఫస్ట్ టైం గెలుచుకుంది. సినీ నటుడు సురేష్ గోపీ ఆ సీటుని సాధించి బీజేపీకి కేరళలో చోటిచ్చారు.
ఇదే మ్యాజిక్ దేశంలో అతి పెద్ద రాష్టం అయిన యూపీలోనూ జరిగింది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని అలాగే 2019లో 62 ఎంపీ సీట్లు సాధించిన కాషాయ పార్టీని పక్కన పెట్టి మరీ సమాజ్ వాద్ పార్టీ కాంగ్రెస్ మరో నాలుగు పార్టీలు కలసిన కూటమి భారీ ఎత్తున సీట్లు గెలుచుకుంది. ఎస్పీకి ఏకంగా 37 ఎంపీ సీట్లు దక్కితే కాంగ్రెస్ కి ఆరు ఎంపీ సీట్లు లభించడం కూటమిని జనాలు ఎంతగా నెత్తికెత్తుకున్నారు అన్నది తెలియచేస్తుంది.
అలాగే పంజాబ్ లో ఆప్ తో కలసి కట్టిన కాంగ్రెస్ కూటమికే జనాలు జై కొట్టారు. అక్కడ కాంగ్రెస్ ఏడు, ఆప్ మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. అలాగే శిరోమణి అకాళీదళ్ ఒక సీటు గెలుచుకుంది. ఇక్కడ ఒంటరిగా పోటీ చేసిన బీజేపీని జనాలు పక్కన పెట్టేశారు
ఇక బీహార్ లో చూసుకుంటే బీజేపీ జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ దళ్ పార్టీ, మాజీ సీం మాంజీ నాయకత్వంలోని పార్టీలు కలసి కూటమి కట్టాయి. మొత్తం 40 ఎంపీ సీట్లు ఉన్న చోట 29 సీట్లను గెలుచుకుని ఎండీయే కూటమి విజయభేరీ మోగించింది. ఇక్కడ ఇండియా కూటమికి 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఇలా చూసుకుంటే కనుక కూటమి బలమే ఈసారి ఎన్నికల్లో అధికారాన్ని తెచ్చింది అని చెప్పకతప్పదు.
పది మంది కలిస్తే బలం అన్న సామెతను జనాలు నిజం చేసి చూపించారు. అదే సమయంలో రెండు కూటములు పోటీ చేసినా అందులో బలమైన కూటమికే జై కొట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో కూటముల హవా కనిపించింది. దీనిని కనుక అర్ధం చేసుకుంటే సింగిల్ గా పోటీ చేస్తే విజయం దక్కదని కూడా చెప్పుకోవచ్చు. అంతా కలసి వస్తే ఆ బలాన్ని జనాలు కూడా గుర్తించి ఆశీర్వదిస్తున్నారు అని కూడా భావిస్తున్నారు. సో సింహం సింగిల్ అని గుంపులుగా రావడాన్ని ఎద్దేవా చేస్తే మాత్రం ఓటములతోనే ఇబ్బంది పడాల్సి వస్తుందన్న సందేశాన్ని మాత్రం ఈసారి ఎన్నికలు ఇచ్చాయని అంటున్నారు.