పేర్ని నాని సతీమణిపై లుక్ ఔట్ నోటీసులు... జిల్లాలో రాజకీయంగా ఆసక్తికర చర్చ!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రేషన్ బియ్యం మాయం అనే అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-17 05:35 GMT

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రేషన్ బియ్యం మాయం అనే అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ నెల 10న గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్ తేజపై పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జయసుధకు లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.

అవును... రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధతో పాటు గోదాము మేనేజర్ పైనా కేసు నమోదవ్వగా.. దీనిపై 13న జయసుధ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. ఈ విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు న్యాయమూర్తి.

ఈ లోపు.. జయసుధ విదేశాలకు వెల్లకుండా అంటూ లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయాలను జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ కేసు వ్యవహారంలో అటు ప్రభుత్వం కానీ, ప్రజా ప్రతినిధులు కానీ.. ఇటు అధికారులు కానీ అసలత్వం వహిస్తున్నారనే చర్చ జిల్లాలో మొదలైందని అంటున్నారు.

ఈ విషయంలో కొందరు మంత్రులు, ఉమ్మడి కృష్ణాజిల్లాలో పార్టీలకు అతీతంగా పలువురు ప్రజా ప్రతినిధులు సైలంట్ గా ఉన్నారనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. మరోపక్క ఈ వ్యవహారంపై అటు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కానీ, ఇటు హోంమంత్రి అనిత కానీ సీరియస్ గా స్పందించడం లేదనే చర్చా మొదలైందని అంటున్నారు.

వాస్తవానికి తమ గోదాముల్లో బియ్యం మాయమయ్యాయని పేర్ని నాని కుటుంబ సభ్యులు లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాయమైన బియ్యానికి సంబంధించి జరిమానాతో కలిపి డబ్బు కట్టమని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో... ఈ నెల 13వ తేదీన తొలివిడతగా కోటి రూపాయల మొత్తానికి డీడీలు తీశారు.

అనంతరం తాజాగా ఈ నెల 16న (సోమవారం) మరో రూ.70 లక్షలకు డీడీలు ఇచ్చారని అంటున్నారు. దీంతో.. జరిమానాలతో కలిపి మొత్తం ఇప్పటివరకూ రూ.1.70 కోట్లకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ లను అధికారులకు అందించారన్నమాట. అయితే.. దీనిపైనా చర్చ మొదలవ్వడం గమనార్హం.

ఇందులో భాగంగా... జరిమానాతో కలిపి ఇప్పటికే సొమ్ము చెల్లించామని చెప్పి తేలిగ్గా బయట పడొచ్చని పేర్ని నాని కుటుంబానికి అధికారులే సలహా ఇచ్చి, ఆ మేరకు అవకాశాన్ని కల్పించారంటూ ఓ వర్గం జనం తెగ ఫీలయిపోతున్నారని అంటున్నారు! ఏది ఏమైనా... ఈ వ్యవహారంలో జయసుధకు లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News