అదే రిజల్ట్ రిపీట్ అంటున్న పేర్ని నాని

టీడీపీ కూటమికి ఏమి ఖర్మ పట్టింది చంద్రబాబు అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు.

Update: 2024-08-30 03:39 GMT

టీడీపీ కూటమికి ఏమి ఖర్మ పట్టింది చంద్రబాబు అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. మీకు ప్రజలు 164 సీట్లతో పట్టం కట్టారు, ఆ నంబర్ చాలదా ఎందుకు వైసీపీ వారిని ఆకర్షించి మరీ రాజకీయ బేరాలు చేస్తున్నావని నిగ్గదీశారు. ఈ కొనుగోళ్ళు అమ్మకాలు ఏంటీ డ్రామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ఎంపీల చేత రాజీనామాలు చేయించిన ఖాళీలలో ఎవరిని తిరిగి రాజ్యసభకు చంద్రబాబు పంపిస్తారో అందరికీ తెలుసు అని కూడా సెటైర్లు వేశారు. ఇద్దరు బీసీ ఎంపీల చేత రాజీనామా చేయించిన చంద్రబాబు ఆ ప్లేస్ లో మరో ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపించగలరా అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఎంతసేపూ రాజకీయ బేరసారాల మీద ఆసక్తి తప్ప ఇచ్చిన హామీల అమలు మీద లేదని అన్నారు. మూడు నెలలకు దగ్గర పడిన ప్రభుత్వంలో ఒక్క హామీనీ అమలు చేయలేదని అన్నారు. ప్రజలు ఈ విషయంలో అసహనంగా ఉన్నారని ఆయన అంటూ బాబు గత చరిత్ర మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు.

గతంలోనూ చంద్రబాబు సీఎం గా ఉండగా వైసీపీని వీక్ చేయడానికి 23 మంది ఎమ్మెల్యేలను నలుగురు ఎంపీలను ఇంకా చాలా మందిని తీసుకున్నారని అయినా 2019లో ఓటమి పాలు కాలేదా అని పేర్ని లాజిక్ పాయింట్ తీశారు. వైసీపీని బలహీనం చేసి టీడీపీ బలంగా మారితే ఎందుకు ఓడిపోవాలని ఆయన నిలదీశారు.

వైసీపీ అధినేత జగన్ నమ్ముకున్నది జనం బలాన్ని అని ఆయన చెప్పారు. ప్రజలు జగన్ తో ఉన్నంతవరకూ ఎంతమంది వైసీపీ నేతలను బాబు లాగేసినా తమకు భయం లేదని అన్నారు. బాబుది రాజకీయ బెదిరింపు అని అంటూ దానికి తాము తగ్గేది లొంగేదీ లేదని అన్నారు.

చంద్రబాబు తీసుకుంటున్న నాయకులకు పదవులు ఇచ్చింది జగన్ అని అలా పదవులు ఉన్న వారికే తీసుకుంటున్నారు తప్పించి వేరెవరినీ దగ్గరకు రానీయడం లేదు కదా అని కూడా పేర్ని నాని అన్నారు. టీడీపీ నేతలకు నాయకులు కావాలని, అలాగే పొత్తులు కావాలని ఆయన అన్నారు.

చంద్రబాబుకు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడవడానికి కూడా ఆయన కుమారులు కుమార్తెలు తోడల్లుళ్ళ సాయం కావాల్సి వచ్చిందని సెటైర్లు వేశారు. నాటి నుంచి మొదలెడితే 1999లో వాజ్ పేయి చంకనెక్కి అధికారంలోకి వచ్చారని, 2014లో మోడీ పవన్ సాయంతో మళ్లీ అధికారం సొంతం చేసుకున్నారని, 2024లోనూ అదే మోడీ పవన్ ల వల్లనే పవర్ దక్కిందని చెప్పారు.

రాజకీయాల్లో ఓటమి చెందిన పార్టీలు మనుగడలో ఉండకూడదా అని పేర్ని నాని ప్రశ్నించారు టీడీపీ కూడా అనేక సార్లు ఓడిందని మరి బాబు ఎందుకు రాజకీయం చేస్తున్నారని నిలదీశారు. ఆఖరుకు ఎన్టీఆర్ కూడా ఒకసారి ఓటమి చెందారని మరి టీడీపీ మనుగడలోనే ఉంది కదా అని పేర్ని నాని అన్నారు. వైసీపీకి ప్రజా బలం ఉందని, జగన్ ప్రజా నాయకుడని బాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్ని నాని తేల్చేశారు. 2014లో బాబు చేసిన రాజకీయమే చేస్తున్నారు కాబట్టి 2019 రిజల్టే రిపీట్ అవుద్ది అంటూ పేర్ని నాని బల్లగుద్దుతున్నరు.

Tags:    

Similar News