సరికొత్త షాక్: పెట్రోల్ ధర 305.. డీజిల్ ధర 311!
ఏ దేశంలో అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయో అప్పుడు ఆ దేశంలో ఆర్ధిక సంక్షోభం లేదని అంటుంటారు!
ఏ దేశంలో అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయో అప్పుడు ఆ దేశంలో ఆర్ధిక సంక్షోభం లేదని అంటుంటారు! కారణం... ప్రభుత్వాలకు ఏ కష్టమొచ్చినా ముందుగా వారు ఆశ్రయించేది పెట్రోల్, డీజిల్ ధరలపైనే అని చెబుతుంటారు. దీంతో... పావల, అర్ధ, రూపాయి అంటూ మెల్లి మెల్లిగా పెంచుకుంటూ పోతారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో కనిపించింది ఇదే! ఈ నేపథ్యంలో పాక్ లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది!
అవును... దశాబ్దాలుగా ఎన్నడూలేని విధంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా... ఆ దేశ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న పాక్ లో ఇంధన ధరలు తాజాగా రూ. 300 మార్కును దాటాయి. ఈ ధరలు ప్రస్తుత పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని అంటున్నారు నిపుణులు!
ఈ సమయంలో తాజాగా పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంధన ధరలను పెంచేసింది. ఇందులో భాగంగా... పెట్రోల్ ధరను 14.91, హై-స్పీడ్ డీజిల్ ధరను 18.44 పెంచినట్లు ప్రకటించింది. దీంతో... ప్రస్తుతం పాకిస్థాన్ లో పెట్రోల్ ధర 305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర 311.84 కి చేరుకుంది. ఇది ఆల్ టైం హై అని అంటున్నారు ఆర్థికవేత్తలు!
కాగా... విద్యుత్ బిల్లుల పెంపుపై దేశంలో ప్రజలు ఇటీవల పెద్ద ఎత్తున నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టడంతోపాటు... డిస్కమ్ సంస్థల అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు.
ఇటీవలే ఆర్థిక సంస్కరణలతో పాకిస్థాన్ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరింది. ఫలితంగా పాకిస్థానీ రూపాయి కూడా క్రమంగా దిగజారిపోతోంది. దీంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా పెంచాల్సి వచ్చింది. ఫలితంగా దేశ కరెన్సీ డాలరు మారకంలో 305.6 వద్ద ట్రేడవుతోంది. ఈ ఒక్క అంకె చాలు... ప్రస్తుత పాకిస్థాన్ ఆర్ధిక సంక్షోభం తీవ్రతను వెల్లడిపరచడానికి అని అంటున్నారు ఆర్ధిక వేత్తలు!