ఇదీ భారతం.. ‘పీహెచ్‌డీ సబ్జీవాలా’.. ఆలోచనలో పడేస్తుంది
పశ్చిమ దేశాలతో పోలిస్తే.. మన దేశంలో ఇప్పటికే శాస్త్రసాంకేతిక పరిశోధనల మీద పెద్దగా ఫోకస్ లేదు.
సోషల్ మీడియా పుణ్యమా అని చెడు ఎంత త్వరగా వ్యాప్తిస్తుందో.. ప్రపంచ వ్యాప్తంగా మారుమూల జరిగే ఉదంతాలన్ని అందరూ తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పీహెచ్ డీ సబ్జీవాలా ఉదంతం గురించి తెలిసినంతనే మనసు చేదుగా మారటమే కాదు.. ఇదేం భారతమన్న భావన కలుగక మానదు. ఎందుకంటే.. ఎక్కడైతే ‘గురువు’కు గౌరవ మర్యాదలు లభించవో.. అక్కడ తర్వాతి తరాల మీద పడే చెడు ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. పశ్చిమ దేశాలతో పోలిస్తే.. మన దేశంలో ఇప్పటికే శాస్త్రసాంకేతిక పరిశోధనల మీద పెద్దగా ఫోకస్ లేదు. అందుకే ఆవిష్కరణల్లో మనం వెనుకబడి ఉంటాం.
మరోవైపు.. విద్యాధికులు అధ్యాపకులుగా మారాలన్న నిర్ణయం వారి పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వ టీచర్లు.. ఉపాధ్యాయుల పరిస్థితి ఫర్లేదు కానీ.. ప్రైవేటు విభాగంలో పని చేసే అధ్యాపకుల పరిస్థితి నేటికి అంత గొప్పగా లేని పరిస్థితి. తాజా ఉదంతం ఇలాంటి ఒక కీలక సమస్యను తెలియజేలా ఉందని చెప్పాలి. పీహెచ్ డీ.. నాలుగు సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలతో పాటు.. మరో పీహెచ్ డీ కోసం ప్రయత్నిస్తునన ఒకరు ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ ను వదిలేసి.. రోడ్డు మీద కూరగాయలు అమ్మే పరిస్థితికి ఎదురుకావటానికి మించిన దురద్రష్టం ఇంకేం ఉంటుంది.
పంజాబ్ కు చెందిన డాక్టర్ సందీప్ సింగ్ ఉదంతం దేశంలో టీచింగ్ ప్రొఫెషన్ ను ఎంచుకునే వారి దుస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలియజేలా ఉందని చెప్పాలి. పీహెచ్ డీ చేసి.. ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరిన ఆయన తన నిర్ణయాన్ని మార్చుకొని కూరగాయల వ్యాపారం మొదలు పెట్టారు. పీహెచ్ డీ సబ్జీవాలా పేరుతో బండి మీద కూరగాయలు అమ్ముతున్నారు.
న్యాయశాస్త్రంలో పీహెచ్ డీ పూర్తి చేసి పంజాబ్ వర్సిటీలో కాంట్రాక్టు ప్రొఫెసర్ గా పని చేసే 39 ఏళ్ల సందీప్ సింగ్ వరుస పెట్టి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇంత చదువు చదివి.. ప్రొఫెసర్ గా పని చేస్తున్నా.. పేమెంట్ మాత్రం సరిగా అందని పరిస్థితి. చాలీచాలని జీతంతో తెగ ఇబ్బంది పడుతున్న అతడు.. చివరకు ప్రొఫెసర్ ఉద్యోగం కంటే.. కూరగాయల బిజినెస్ చేయటం బాగుందన్న నిర్ణయానికి వచ్చేశారు.
జాబ్ వదిలేసి.. బండి మీద కూరగాయలు అమ్ముతున్నారు. పీహెచ్ డీ సబ్జీ వాలా అనే బోర్డు పెట్టి మరీ వీధి వీధి తిరుగుతూ కూరగాయలుఅమ్ముతున్నారు. ఇతగాడిని చూసిన నెటిజన్ ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. తాను ప్రొఫెసర్ గా సంపాదించే దాని కంటే కూరగాయలు అమ్మటం ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నట్లుగా తెలియజేశారు. ఓపక్క కూరగాయలు అమ్ముతూనే.. చదువు మీద తనకున్న ఇష్టాన్ని వదిలేయలేదు. మరో పీహెచ్ డీని పూర్తి చేసేందుకు ఆయన శ్రమిస్తున్నారు. ఇలాంటి వారు టీచింగ్ లో ఉంటే.. విద్యార్థుల భవిష్యత్తు మరెంత బాగుంటుంది?