ఆ ఇష్యూలో కేటీఆర్ కోసం ఫోన్ ట్యాపింగ్?

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి

Update: 2024-05-29 04:54 GMT

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. అధికారంలో ఉండటమే లక్ష్యంగా ఎన్ని లత్తుకోరు పనులు చేశారన్న విషయాన్ని ఫోన్ ట్యాపింగ్కేసులో నిందితులుగా పోలీసు అధికారులు విషయాల్ని ఓపెన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన వేళలో.. సంచలన నిజాల్ని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ఇప్పటివరకు రాని మాజీ మంత్రి కేటీఆర్ పేరు తాజాగా వచ్చేసింది.

దీంతో.. ఇప్పటివరకు గులాబీ బాస్ కం పెద్దాయన కేసీఆర్.. ఆయన కుమార్తె కవిత.. మాజీ మంత్రి హరీశ్ రావులు మాత్రమే కాదు.. తాజాగా కేటీఆర్ కు కూడా సీన్ లోకి వచ్చేసిన వైనం వెలుగు చూసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఎపిసోడ్ లో నిరుద్యోగ సమస్యపై యువత ఆగ్రహంగా ఉండటం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యల్ని నాటి విపక్ష నేతలు.. విద్యార్థి సంఘాల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించే వారు. ఇలా కేటీఆర్ మీద విమర్శలు చేసే వారి ఫోన్లను టార్గెట్ చేసి.. ట్యాపింగ్ చేసేవారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా ఏమేం మాట్లాడుకుంటున్నారన్నది గుర్తించి.. ఆ విషయాల్ని చేరవేసిన వైనాన్ని తాజాగా వెల్లడించారు.

తన వాంగ్మూలంలో సంచలన విషయాల్ని వెల్లడించిన భుజంగరావు మరిన్ని విషయాల్ని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేతల ఆర్థిక మూలాల్ని దెబ్బ తీయటం.. అదే సమయంలో అధికార పార్టీకి ఆర్థిక వనరుల్ని అందించే మార్గాల్ని అన్వేషించిన వైనం వెలుగు చూసింది.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అనేక పోలీసు కేసుల్లో ప్రమేయం ఉన్న ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించిన వైనం తాజాగా బయటకు వచ్చింది.

రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావు నుంచి రూ.15 కోట్ల విరాళం ఇవ్వగా.. అందులో రూ.13 కోట్లతో బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేయించామని.. యశోదా ఆసుపత్రితో పాటు మరో ప్రముఖ ఆసుపత్రి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ఫండ్ అందినట్లుగా చెప్పారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాలకు తగ్గట్లు టాస్క్ ఫోర్సు వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లామన్న భుజంగరావు.. కంపెనీలు.. వీఐపీలు.. వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేశామని చెప్పటం గమనార్హం. మొత్తంగా తమను వ్యతిరేకించేవారిని.. తమకు ఆర్థిక వనరులుగా ఉండే వారిని టార్గెట్ చేసిన కేసీఆర్ అండ్ కో ప్లాన్ గుట్టు పోలీసు అదికారులు వాంగ్మూలంతో బయటకు వచ్చిందని చెప్పాలి. రానున్న రోజుల్లో మరెన్ని ఘోరమైన నిజాలు వెలుగు చూస్తాయో?

Tags:    

Similar News