త్రిశంకు స్వర్గంలో పిన్నెల్లి.. !
ఇంత జరుగుతున్నా.. వైసీపీ నుంచి ఎలాంటి సానుభూతి లేకపోవడం.. వంటివి పిన్నెల్లిని త్రిశంకు స్వర్గంలో నిలబెట్టాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నారు. ఎలా వ్యవహరించినా.. తిరుగులేదని భావించారు. కానీ, పరి స్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఇలా వ్యవహరిస్తే బాగానే ఉంది కానీ.. ఇప్పుడు మాత్రం ఎక్క డా బాగోలేదు. ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వైసీపీ నాయకుడిగా ఉన్న ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్నారని పార్టీలో నాయకులే అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఎన్నికల కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆయనకు అనుమతి కావాల్సిన అవసరం ఏర్పడింది. ఒకప్పుడు ఏ స్టేషన్‌లో అయితే.. ఆయన కాలిపై కాలు వేసుకుని ఎస్సై సహా సీఐ వరకు అధికారులను ఆదేశించి తాను చెప్పినట్టు చేయించుకున్నారో.. ఇప్పుడు అదే స్టేషన్‌లో చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకన్నా.. ఆయనకు అవమానం ఏమీ లేదు.
అంతేకాదు.. ప్రస్తుతం ఆయన కుమారుడిని స్విట్జర్లాండ్‌లో చదివించేందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి సంబంధించి ఈ నెల 15తో గడువు కూడాతీరిపోతుంది. కానీ, ఇప్పటి వరకు కోర్టు నుంచి అనుమతి రాలేదు. పాస్ పోర్టు ఇవ్వమని హైకోర్టు ఆదేశించినా.. విదేశాలకు వెళ్లాలో వద్దో తేల్చాల్సిన బాధ్యతను గుంటూరులోని మేజిస్ట్రేట్ కోర్టుకు అప్పగించింది. దీంతో పిన్నెల్లి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.
ఇక, న్యాయపరంగా కూడా పోలీసులు అసలు బెయిల్‌నే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గత నేర చరిత్రను కూడా వెలికి తీస్తున్నారు. ఇది నేడో రేపో హైకోర్టులో విచారణకు రానుంది. ఈ పరిణామాలు పిన్నెల్లిని మరింత ఇబ్బంది పెట్టనున్నాయి. ఒకవైపు కుమారుడిని తీసుకుని స్విట్జర్లాండ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. మరోవైపు కేసులు.. ఇంత జరుగుతున్నా.. వైసీపీ నుంచి ఎలాంటి సానుభూతి లేకపోవడం.. వంటివి పిన్నెల్లిని త్రిశంకు స్వర్గంలో నిలబెట్టాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట.