విచారణలోనూ తన మార్క్ బిల్డప్ తో షాకిస్తున్న పిన్నెల్లి

గడిచిన కొద్దిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి వార్తల్లో నలుగుతున్నారు.

Update: 2024-07-11 04:14 GMT

గడిచిన కొద్దిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి వార్తల్లో నలుగుతున్నారు. ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు.. ఆయన్ను విచారణ చేస్తున్న అధికారుల్ని సైతం అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. కళ్లకు కట్టినట్లుగా ఆయన ఈవీఎంను ఎత్తి పడేసి.. పగలకొట్టేసిన వీడియోను కొన్ని కోట్ల మంది చూసినప్పటికి ఆయన మాత్రం తగ్గట్లేదు. తాను ఏవీఎంలను టచ్ చేయట్లేదంటూ కాన్ఫిడెంట్ గా చెబుతున్న మాటలకు ఆయన్ను విచారణ చేస్తున్న అధికారులకు నోట మాట రావటం లేదంటున్నారు.

పోలింగ్ వేళ ఈవీఎంలను ధ్వంసం చేసిన ఆరోపణపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కావటం తెలిసిందే. ఆయన్ను విచారణ చేస్తున్న అధికారులకు తన గురించి తాను ఇచ్చుకుంటున్న బిల్డప్ అదిరేలా ఉందంటున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఆ మాటకు వస్తే తన మీద కేసులు లేవని.. ఉన్నది ఒకే ఒక్క ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రమేనని.. అది కూడా తప్పుడు ఆరోపణలతో పెట్టిన కేసు మాత్రమేనని స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లిని పోలీసులు రెండు రోజుల విచారణకు కస్టడీకి తీసుకోవటం.. అధికారులు అడిగిన ప్రశ్నలకు సూటి సమాధానాలు చెప్పని ఆయన..అసలు తాను తప్పే చేయలేదని చెప్పుకోవటం.. విచారణకు సహకరించకపోవటం లాంటి తీరును ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ను గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు విచారించారు. ఈ సందర్భంగా అడిగిన ఏ ప్రశ్నకు తిన్నగా సమాధానం ఇవ్వలేదంటున్నారు.

పిన్నెల్లి మీద ప్రధాన ఆరోపణ అయిన పాల్వాయి గేటు వద్ద ఉన్న పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి.. అక్కడి ఈవీఎంను బద్ధలు కొట్టిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావటం.. దేశ వ్యాప్తంగా సంచలనంగా కావటం తెలిసిందే. తాజాగా పోలీసుల విచారణ సందర్భంగా తాను పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లోకి వెళ్లలేదని పిన్నెల్లి స్పష్టం చేయటం గమనార్హం. ఇదే కేసుకు సంబంధించి జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం.. ఆయన్ను పరామర్శించి వచ్చిన తర్వాత జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ చేసిన కీలక వ్యాఖ్యల్ని చూస్తే.. ‘పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌లో ఏకపక్ష ఎన్నిక జరుగుతుండటంతో అడ్డుకునేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు, అందులో తప్పేముంది’ అని పేర్కొన్నారు. పిన్నెల్లి పోలింగ్ బూత్ లోకి వెళ్లారని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేస్తే.. అందుకు భిన్నంగా తాను పోలింగ్ బూత్ లోకే వెళ్లలేదంటూ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఏమైనా పోలీసుల విచారణలోనూ పిన్నెల్లి ప్రదర్శిస్తున్న కాన్ఫిడెన్స్ పోలీసు వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News