ఎయిర్ పోర్ట్స్ అలర్ట్... పిన్నెల్లికి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే

Update: 2024-05-22 09:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌ లను ధ్వంసం చేశారనే ఆరోపణలతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సమయంలో... పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారని తెలుస్తుంది. ఈ సందర్భంగా సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఈవీఎం, వీవీప్యాట్‌ లను ధ్వంసం చేశారనే ఆరోపణలపై పిన్నెల్లి ఇరామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌ కు చేరుకున్నాయని తెలుస్తుంది. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీచేశారు!

పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తుంది. దీంతో అన్ని విమానాశ్రయాల్లోనూ ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. మరోపక్క ఈ ఘటనపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తుంది. ఈ క్రమంలో పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సాయంత్రం 5లోగా నివేదిక ఇవ్వాలని ఈసీ పేర్కొంది!

ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా స్పందించారు. ఇందులో భాగంగా.. ఈ ఘటనకు సంబంధించి సిట్‌ కు పోలీసులు అన్ని వివరాలను అందించారని తెలిపారు. ఈ ఘటనలో మొదటి నిందితుడైన పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారని చెబుతున్నారు. ఫలితంగా... నేరం రుజువైతే ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందని మీనా తెలిపారు.

ఈ సమయంలో ఆయనను అరెస్టు చేయడంకోసం పోలీసు బృందాలు వెళ్లాయని.. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని.. ఈ విషయంలో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని సీఈవో స్పష్టం చేశారు. ఈ నెల 13 పోలింగ్‌ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని తెలిపిన మీనా... ఒక్క మాచర్లలోనే సుమారు 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News