ప్రధాని మోడీ ప్రసంగాన్నే అడ్డుకుంది.. ఆమె ఎవరు? ఏం చేసింది?
అవును.. ఆమె ప్రధాని నరేంద్ర మోడీకే టెన్షన్ పెట్టింది.
అవును.. ఆమె ప్రధాని నరేంద్ర మోడీకే టెన్షన్ పెట్టింది. భారీగా హాజరైన సభికుల్ని ఉద్దేశిస్తూ.. సీరియస్ గా ప్రసంగిస్తున్న వేళ.. తన ప్రసంగాన్ని ఆపేసి దాదాపు ముప్ఫై సెకన్ల కంటే ఎక్కువసేపు.. ఒక యువతిని కిందకు దిగాలన్న అభ్యర్థించటమే కాదు.. ఆమె కిందకు దిగే వరకు ఒకలాంటి టెన్షన్ కు గురైన పరిస్థితి. ఇదంతా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో చోటుచేసుకున్న ఘటన. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..
పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్న వేళలో.. హటాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కారణం.. ఒక యువతి బ్యాక్ పాక్ వీపునకు తగిలించుకొని.. విద్యుత్ స్తంభం ఎక్కటంతో ఆందోళన వ్యక్తమైంది. ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ఆపేసి.. ఆ యువతిని విద్యుత్ స్తంభం నుంచి కిందకు దిగాలంటూ అభ్యర్థించారు. దేశ ప్రధాని స్వయంగా అభ్యర్థిస్తున్న వేళ.. ఆమె మరింత పైకిఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో.. ప్రధాని మోడీ పదే పదే ఆమెను కిందకు దిగాలని కోరారు. ‘‘నీ బాధను కచ్ఛితంగా తెలుసుకుంటా. ఇలా చేయొద్దు. షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కిందకు దిగాలి’’ అని పదే పదే కోరారు.
సదరు యువతిని ముందు కిందకు దిగాలన్న ఆయన.. ఎలాంటి ఆఘాయిత్యాలకు పాల్పడొద్దన్నారు. ప్రధాని మోడీ వినతి మేరకు ఆమె కిందకు దిగింది. ఆ సమయంలో కొందరు ఆమె పడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె కిందకు దిగి.. ఎలాంటి ప్రమాదం లేదన్నది అర్థమైన తర్వాతనే ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక.. విద్యుత్ స్తంభం ఎక్కిన యువతిని పోలీసులు ఆరా తీశారు.
ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి ఆ యువతి బదులిస్తూ.. తన పేరు కవిత అని.. తనది వనపర్తి జిల్లాగా పేర్కొన్నారు. తాను ఉస్మానియా వర్సిటీలో చదువుతున్నానని.. చదువుకు తగ్గ ఉద్యోగం రావటం లేదన్న మనస్తాపంతో తానీ పని చేసినట్లుగా పోలీసులకు చెప్పారు. ప్రధాని మోడీ స్పీచ్ ను అడ్డుకున్న ఈ యువతికి చెందిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.