ఎన్నాళ్లకు ఆ పాక్ మాజీ ప్రధానికి తెలివి వచ్చింది.. భారత్ మీద పడలేదు

అంతేకాదు.. పాక్ లోని పాలనను శాసించే సైనిక వ్యవస్థ మీదా వారికి సమయానికి తగ్గట్లు సహకరించే న్యాయవ్యవస్థ మీద చురకలు సంధించారు.

Update: 2023-12-20 15:30 GMT

అవసరమున్నా లేకున్నా ఎదుటోడి మీద ఏడుపుతో పడి చచ్చే వారికి వాస్తవాన్ని చూసే అలవాటు ఉండదు. దాయాది పాక్ లో అలాంటి పరిస్థితే. అక్కడి పాలకులే కాదు రాజకీయ నాయకులు సైతం నిత్యం తమ తప్పుల్ని కప్పి పుచ్చుకోవటానికి భారత్ మీదనో.. అమెరికా మీదనో.. ఇంకేదో పనికి మాలిన కారణం మీదనో పడిఏడుస్తుంటారే తప్పించి.. తాము చేసిన తప్పుల్ని మాత్రం ఒప్పుకోవటం కనిపించదు. తమ వ్యవస్థలోని లోపాల్ని వేలెత్తి చూపించుకునే సాహసం చేయరు. తాజాగా అలాంటి అరుదైన పరిణామం పాక్ లోచోటు చేసుకుంది.

భారత్.. అమెరికాల మీద పడి ఏడవకుండా.. తమ వ్యవస్థలోని తప్పుల్ని ప్రస్తావిస్తూ.. తాము ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సమస్యలకు కారణం తామేనన్న కఠిన నిజాన్ని ఒప్పేసుకున్నారు పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. అంతేకాదు.. పాక్ లోని పాలనను శాసించే సైనిక వ్యవస్థ మీదా వారికి సమయానికి తగ్గట్లు సహకరించే న్యాయవ్యవస్థ మీద చురకలు సంధించారు. ఇప్పటికే మూడుసార్లు పాకిస్థాన్ కు ప్రధానిగా వ్యవహరించిన నవాజ్.. నాలుగోసారితాను ప్రధాని కావాలన్న పట్టుదలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

పాకిస్థాన్ లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున టికెట్లు ఆశించే అభ్యర్థులతో భేటీ అయ్యారు. తాను నాయకత్వం వహించే పాకిస్థాన్ ముస్లిం లీగ్ నాయకులతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితికి కారణం ఏమిటన్న దానిపై ఆయన ఓపెన్ అయ్యారు. ‘‘మనం ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితికి భారత్.. అమెరికా కారణం కాదు. అప్ఘానిస్థాన్ అనిశ్చితి కాదు. వాస్తవానికి మన కాళ్లను మనమే కాల్చుకుంటున్నాం. 2018 ఎన్నికల్లో మనపై బలవంతపు ప్రభుత్వాన్ని రుద్దారు. దాంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక వ్యవస్థ దిగజారింది’’ అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ప్రతిసారీ సైనిక నియంతలకు న్యాయమూర్తుల మద్దతు లభించటాన్ని ప్రస్తావించేందుకు నవాజ్ అస్సలు వెనకాడలేదు. ‘‘సైనిక పాలనకు చట్టబద్ధతను కల్పించారు. ప్రధానమంత్రుల్ని తొలగించినప్పుడల్లా వారు ఆమోదించారు. ఇదంతా ఎందుకు జరిగిందో ఆలోచించాలి. 2017లో నన్ను అధికారంలో నుంచి దించేయటానికి ఐఎస్ఐ మాజీ అధినేత ఫయాజ్ హమీద్ ఎంత ప్రయత్నించారు’’ అంటూ గతాన్ని గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే.. ఇన్నాళ్లకు తాము చేస్తున్న తప్పుల్ని నిజాయితీగా ఒప్పుకునే నేత ఒకరు బయటకు వచ్చినట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News