గాంధీ, కౌశిక్ ఎపిసోడ్‌లో ట్విస్ట్.. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం చివరకు మరో మలుపు తిరిగింది.

Update: 2024-09-14 06:02 GMT

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం చివరకు మరో మలుపు తిరిగింది. కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాంధీపై చర్యలు తీసుకున్నారు. ఊహించని విధంగా హత్యాయత్నం కేసు నమోదు చేసి ట్విస్ట్ ఇచ్చారు.

గత మూడు రోజులుగా ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య వివాదంతో హైదరాబాద్‌లో రాజకీయం అట్టుడుకుతోంది. గాంధీని పీఏసీ చైర్మన్ చేయడంతో ఈ వివాదం రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌కు దగ్గరగా ఉంటున్నారని టాక్. అందులో భాగంగా.. ప్రెస్‌మీట్ పెట్టిన కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. వారికి పదవులు కట్టబెట్టడం ఏంటని నిలదీశారు. వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము పంపించిన చీరె, గాజులు ధరించి ప్రజల్లో తిరగాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో గాంధీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన వ్యక్తి.. ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ తమ పార్టీలోనే ఉంటే పార్టీ ఆఫీసుకు వచ్చి మీడియాతో మాట్లాడాలని సవాల్ విసిరారు. లేదంటే తానే స్వయంగా గాంధీ ఇంటికి వచ్చి మెడలో కండువా వేసి.. ఆయన ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తానని సవాల్ చేశారు.

దీంతో అప్పటి నుంచి ఇరువురి మధ్య మాటలయుద్ధం మొదలైంది. దీనికి గాంధీ సైతం తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. దమ్ముంటే కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావాలని.. లేదంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానని ప్రతిసవాల్ చేశారు. ఆ మరుసటి రోజు కౌశిక్ రెడ్డి.. గాంధీ ఇంటికి రాలేదు. దాంతో గాంధీ పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి కౌశిక్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతేకాదు.. కౌశిక్ ఇంటిపై గాంధీ వర్గీయులు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. దాంతో ఆయన ఇంటి కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గురువారం అంతా కూడా కౌశిక్ ఇంటి మధ్య ఉత్కంఠ నెలకొంది. చివరకు గాంధీ రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఇక అప్పుడు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వచ్చి కౌశిక్‌కు మద్దతుగా నిలిచారు. దాంతో వెంటనే పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి సాయంత్రానికి పోలీస్ కమిషనరేట్‌‌కు చేరుకున్నారు. దాంతో అక్కడ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ అర్ధరాత్రి వరకు వాహనాల్లో తిప్పారు. చివరకు పూచీకత్తుపై విడుదల చేశారు.

ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నం జరిగిందని, తన ఇంటిపై దాడిచేసిన వారందరిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ విధ్వంసం కేసులో అరికెపూడి గాంధీ, ఆయన సోదరుడు, కుమారుడితోపాటు పలువురు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్‌లపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఇప్పుడు ఈ పరిణామం కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News