పవన్ చెప్పాలనుకున్నదేంటి.. చెపుతోందేంటి...!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారాహి యాత్ర 2.0 ప్రారంభించారు. కాదు కాదు.. ఇది కూడా ముగిసిపోతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారాహి యాత్ర 2.0 ప్రారంభించారు. కాదు కాదు.. ఇది కూడా ముగిసిపోతోంది. ఇప్పటికే తొలి విడత ఆయన ఈ యాత్రను పూర్తి చేశారు. తొలి రెండు యాత్రలు కూడా ఉభయ గోదావరి జిల్లాలకే ఆయన పరిమితం చేశారు. అయితే.. ఇక్కడ ఈ యాత్రల ద్వారా ఆయన చెప్పాలనుకున్నది ఏంటి? చెబుతున్నది ఏంటి? అనేది కీలకంగా మారింది. ఒక్కసారి నాలుగు నెలల కిందటకు వెళ్తే.. వారాహి యాత్ర ప్రారంభానికి ముందు పవన్ చేసిన ప్రకటన.. ఈ యాత్ర ద్వారా.. పార్టీని బలోపేతం చేస్తామని.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు.
``వారాహి యాత్ర.. పార్టీని బలోపేతం చేస్తుంది. వాడవాడలా పార్టీ కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపుతుంది. ఇది రాజకీయ యాత్ర కన్నా.. పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న యాత్ర అని ఖచ్చితంగా చెబుతున్నా. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కూడా గమనించాను. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థను మార్చి తీరుతాం. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతాం``- మంగళగిరి వేదికగా.. అప్పట్లో పవన్ చేసిన ప్రకటన ఇది. దీంతో వారాహి యాత్ర ద్వారా .. పార్టీ బలోపేతం అవుతుందని అందరూ లెక్కలు వేసుకున్నారు.
అయితే.. వారాహి యాత్ర ప్రారంభించారు. కానీ, ఎందుకో దీని ఉద్దేశం, దశ-దిశ వంటివి దారి తప్పాయనే వాదన బలంగా వినిపిస్తోంది. సాధారణంగా రాజకీయ యాత్ర అనగానే.. విమర్శలు లేకుండా ఏదీ జరగదు. దీనిని అర్ధం చేసుకుంటారు.కానీ, అసలు వ్యూహాత్మకంగా అనుకోవాలో.. లేక అనూహ్యంగా అనుకోని పరిణామాలు అనుకోవాలో.. కానీ, వారాహి యాత్ర తొలి రెండు రోజులు తూర్పు గోదావరి జిల్లాలో సాగినప్పుడు కార్యకర్తలకు అంతో ఇంతో దిశానిర్దేశం చేసిన పవన్.. తర్వాత.. తర్వాత..ట్రాక్ తప్పేశారనేది విశ్లేషకుల మాట. కార్యకర్తలకు తొలి రెండు రోజులు ఆయన దిశానిర్దేశం చేశారు.
అందరూ ఐక్యంగా ఉండాలని.. అందరూ కలసి ఉంటేనే గెలుస్తామని.. చెప్పిన పవన్ తర్వాత.. టంగ్ మార్చారు. కేవలం వైసీపీని విమర్శించడంతో నే వారాహి యాత్ర తొలి దశ ముగిసింది. ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యేద్వారం పూడిపై వేసిన సవాళ్లు.. విమర్శ లు.. ముద్రగడ పద్మనాభం లేఖలు వంటివి..తొలి యాత్రనుదారిమళ్లించాయి. ఇక, రెండో యాత్ర చేపట్టిన పవన్ అనూహ్యంగా వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేశారు. అసలు ఈ యాత్రలో కార్యకర్తలకు ఆయన చేసిన దిశానిర్దేశం అనేది లేకుండా పోయింది. పైగా.. రెండో రోజు నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో వారాహి యాత్ర ద్వారా.. పవన్ చెప్పాలనుకున్నది ఏంటి.. చెబుతున్నది ఏంటి? అనే చర్చ మేధావుల మధ్య జోరుగా సాగుతుండడం గమనార్హం.