పవన్ ది విశాల హృదయం. ఆయనకు అందరి పాలకులూ మంచిగానే కనిపిస్తారు. ఆయనకు ఒక్క వైసీపీతోనే తంటా లాగుంది. వైసీపీ ముఖ్యమంత్రిగా జగన్ అంటేనే ఆయనకు కిట్టనిదిగా ఉంది అని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు పవన్ కి ఎంతగానో నచ్చుతారు. అందుకే కూటమి కట్టారు. ఇక నరేంద్ర మోడీ అంటే పవన్ కి ఎంతటి భక్తి ప్రపత్తులు ఉన్నాయో వేరేగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
ఇవన్నీ పక్కన పెడితే పవన్ చాలా ఓపెన్ గా ఒక కాంగ్రెస్ సీఎం ని పొగడడం. రేవంత్ గొప్ప పాలకుడు అని కితాబు ఇచ్చేశారు జనసేన అధినేత పవన్. ఈ విషయంలో ఆయన తెలంగాణాలోని రాజకీయ సమీకరణలను మరచిపోయారు. అక్కడ కాంగ్రెస్ కి యాంటీగా బీజేపీ నిలబడి పోరాటం చేస్తోంది. అదే బీజేపీ ఏపీలో టీడీపీ కూటమిలో ఉంది. అంతే కాదు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో జనసేన కూడా ఉంది.
జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా కట్టిన ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. ఈ లెక్కన ఎన్డీయే మిత్ర పక్షాలు అన్నీ కూడా కాంగ్రెస్ ని రాజకీయ ప్రత్యర్థిగానే చూడాల్సి ఉంటుంది. కానీ పవన్ ఈ రాజకీయ లెక్క పక్కన పెట్టేసినట్లుగా ఉన్నారు.
అందుకే రేవంత్ రెడ్డి కింద నుంచి పైకి వచ్చిన నాయకుడు. మంచి సీఎం అయి కితాబు ఇచ్చేశారు. దానికి తెలంగాణా బీజేపీ నుంచి గట్టిగానే పవన్ కి కౌంటర్ వచ్చి పడింది. కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ అయితే రేవంత్ రెడ్డి ఏ విషయంలో గొప్పగా కనిపించారో పవన్ చెప్పాలని కోరారు. ఆయనలో ఏమి మంచి కనిపించిదో చెప్పాలని ఎద్దేవా చేశారు.
అంతే కాదు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయనందుకు పవన్ కి బాగా నచ్చారేమోనని విమర్శలు గుప్పించారు. నిజానికి రేవంత్ రెడ్డి ఎందుకు గొప్ప నాయకుడిగా కనిపించాడో పవన్ కల్యాణ్‌కు తెలియాలని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ లెక్కలో గొప్ప అన్నది తనకు తెలియదు పవన్ కే తెలియాలని కూడా అన్నారు. అంతే కాదు తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, రూ.4 వేల ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ చెవిలో రేవంత్ రెడ్డి చెప్పి ఉంటారని అందుకే ఆయనకు గొప్పవాడిగా కనిపించాడేమోనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
ఈ విషయం పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా పవన్ కి గొప్పగానే కనిపించింది. ఆయనను కూడా పవన్ పొగిడారు. అపుడు కూడా ఆయన బీజేపీతో పొత్తులో ఉండి మాట్లాడారు. ఇక తెలంగాణా ఎన్నికల సమయంలో ప్రధాని మోడీతో ఎన్నికల సభలో వేదికను పంచుకున్న పవన్ నేరుగా బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని విమర్శించలేదని కూడా అపుడు అంతా అనుకున్నారు.
ఏది ఏమైనా పవన్ కి తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా గొప్ప ముఖ్యమంత్రులే కనిపిస్తున్నారు. అది ఆయన మంచితనానికి నిదర్శనం అంటున్నారు. పవన్ లో ఈ రకమైన రాజకీయ తటస్థత ఉండడం మంచిదే. కానీ అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో ఒక్క మంచి పని కూడా పవన్ కంటికి కనిపించలేదా అన్న మాట కూడా ఉంది. వైసీపీని అదే పనిగా విమర్శిస్తూ పవన్ వచ్చారని గుర్తు చేసిన వారూ ఉన్నారు.
అంతే కాదు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినా ఈ రోజుకీ వైసీపీని విమర్శించడం జరుగుతోంది అంటున్నారు. మొత్తానికి పవన్ కి మంచి మనసు ఉంది కాబట్టి అందరూ మంచివారుగానే కనిపిస్తున్నారు అని కూడా అంటున్న వారూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ సీఎం ని ఎన్డీయే భాగస్వామ్య పక్షం నాయకుడు మెచ్చుకోవడం మాత్రం రాజకీయంగా హైలెట్ గా నిలిచే విషయమే అంటున్నారు.