బాబు మొహమాటం..! 'టీడీపీ' కుటుంబాల్లో పొలిటికల్ చిచ్చు!
అందుకే..చిన్న చిన్న గొడవలు ఉన్నా.. వెంటనే జోక్యం చేసుకుని ఖండించే తత్వం ఆయనకు లేదు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్ల వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న.. ఎప్పటి నుంచో మద్దతిస్తున్న కుటుంబాల్లో రాజకీయ వైరాలు చోటు చేసుకున్నాయి. ఒక రకంగా.. చెప్పాలంటే.. ఇది పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరేనని అంటు న్నారు పరిశీలకులు. పార్టీలో అనుకూలంగా ఉన్నవారు.. ఎవరు? ప్రతికూలంగా ఉన్నవారెవరు? అనే విషయాన్ని అంచనా వేసి.. ముందుగానే నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు ఉండేవి కాదు.
కానీ, చంద్రబాబుకు అందరూ కావాలి. అందరిని కలుపుకొని వెళ్లాలనే లక్ష్యం ఉంది. అందుకే..చిన్న చిన్న గొడవలు ఉన్నా.. వెంటనే జోక్యం చేసుకుని ఖండించే తత్వం ఆయనకు లేదు. ఇది..చాలా సార్లు పార్టీకి మేలు చేయగా.. తాజాగా మాత్రం ఇబ్బంది పెడుతోంది. ఉదాహరణకు విజయవాడ ఎంపీ కేశినేని నాని తొలుత పార్టీ తీర్థం పుచ్చుకుని.. 2014లో ఎంపీ అయ్యారు. తర్వాత.. ఆయన తమ్ముడు చిన్ని వచ్చారు. అయితే.. పార్టీలో ఒకరిద్దరు నాయకులతో ఎంపీ కేశినేని నాని విభేదించడం.. రగడకు దారి తీయడం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని ముందుగానే పరిష్కరించి ఉంటే సమస్య రాకుండానో.. లేక.. విభేదాలు లేకుండానో పోయేది.
కానీ, చంద్రబాబు అలా చేయలేదు. వారిలో వారే తన్నుకుంటే.. తన చేతికి మట్టి అంటదన్న సూత్రాన్ని పాటించి ఉంటారు. దీంతో ఇది కాస్తా.. అన్నదమ్ముల సవాల్‌గా మారి.. ఏకంగా కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక, రాయపాటి రంగారావు కూడా పార్టీకి సానుభూతి పరుడిగా ఉన్నారు. గుంటూరులో పొగాకు యార్డుకు చైర్మన్‌గా చేసినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం టీడీపీకి సానుభూతిపరుడనే పేరుంది.
ఇక, ఆయన 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నరసరావుపేట నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయనకుమారుడు రంగారా వుకు టికెట్ ఇవ్వాలని.. అది కూడా సత్తెనపల్లి లేదా.. నరసరావుపేట ఇవ్వాలని కోరారు. కానీ, ఇదే సమయంలో కాపు నేత అయిన.. వైసీపీ మంత్రి అంబటికి చెక్ పెట్టే ఉద్దేశంతో చంద్రబాబు కన్నా లక్ష్మీ నారాయణకు సీటు ఇచ్చారు. ఈవిషయం విశదీకరించడంలో చంద్రబాబు ఒకింత వెనుకబడ్డారు. దీంతో రాయపాటి కుటుంబం ఆయనను అపార్థం చేసుకుంది.
కానీ, రాయపాటి కుటుంబానికి చంద్రబాబు ఎప్పుడూ సానుభూతి చూపిస్తున్నారు. 2019లో రాయపాటి ఓడిపోతారని తెలిసి కూడా.. నరసారావు పేట ఎంపీ టికెట్ ఇవ్వలేదా? అంటే.. ఇచ్చారుకానీ, తాజా పరిణామాలను అర్థం చేసుకోవడంలో విఫలమైన.. రాయపాటి తనయుడు రంగారావు. చంద్రబాబుపై విమర్శలు చేసి.. ఆయన ఫొటోను సైతం పగలగొట్టారు. ఇది రాయపాటి తమ్ముడు శ్రీనివాసరావుకు కోపం తెప్పించింది. తాము టీడీపీలోనే ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇక, ఆయన కుమార్తె.. రాయపాటి శిరీష.. ప్రస్తుతం అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్నారు.