సింగ‌రేణిపై పార్టీల ఉడుంప‌ట్టు.. పొలిటిక‌ల్ ఎఫెక్ట్ ఎంత‌?

పైగా సింగ‌రేణి కార్మికుల సంఘానికి కేసీఆర్ త‌న‌య ఎమ్మెల్సీ క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఆమె త‌ర‌చుగా ఇక్క‌డ ప‌ర్య‌ట‌న‌లు చేసేలా.. ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించేలా ప్లాన్ చేస్తున్నారు.

Update: 2023-10-19 07:30 GMT

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భూపాల‌ప‌ల్లి జిల్లాలోని సింగ‌రేణి కార్మికుల ఓటు బ్యాంకు ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కీల‌క‌మైన పార్టీల మ‌ధ్య ఉడుంప‌ట్టు రాజ‌కీయాలు సాగుతు న్నాయి. సింగ‌రేణి కార్మికులు మాతోనే ఉన్నార‌ని, ఉంటార‌ని అధికార పార్టీ బీఆర్ ఎస్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది. ఇటీవ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందు సీఎం కేసీఆర్‌.. సింగ‌రేణి కార్మికుల బ‌కాయిలు తీర్చ‌డంతోపా టు.. వారికి బోన‌స్ కూడా ప్ర‌క‌టించిన విష‌యాన్ని నాయ‌కులు గుర్తు చేస్తున్నారు.

పైగా సింగ‌రేణి కార్మికుల సంఘానికి కేసీఆర్ త‌న‌య ఎమ్మెల్సీ క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఆమె త‌ర‌చుగా ఇక్క‌డ ప‌ర్య‌ట‌న‌లు చేసేలా.. ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే.. కాంగ్రెస్ కూడా సుమారు 4 ల‌క్ష‌ల పైచిలుకు ఉన్న సింగ‌రేణి కార్మికుల ఓటు బ్యాంకు కోసం త‌న‌దై న శైలిలో పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలో కేసీఆర్ ఇక్క‌డి కార్మికుల‌కు అన్యాయం చేశారంటూ.. క‌ర‌ప‌త్రాలు పంచుతోంది.

తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సింగ‌రేణిలో ప‌ర్య‌టించారు. సింగరేణికి సీఎండీగా ఒకే అధికారిని ఇంతకాలం ఎందుకు కొనసాగిస్తున్నారని స‌ర్కారును ఆయ‌న‌ ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల త్యాగాలను సీఎం కేసీఆర్‌ మరిచిపోయారని విమ‌ర్శించారు. ''గనుల బిల్లుకు పార్లమెంట్‌లో బీఆర్ ఎస్‌ మద్దతు తెలపలేదా?'' అని నిల‌దీశారు.

సింగరేణి లాభాల్లో ఉండాలంటే మంచి యాజమాన్యం ఉండాలని, ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామ‌ని రేవంత్ హామీ ఇచ్చారు. భూపాలపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ ఎన్నిసార్లు ఓడిపోయినా మీతోనే ఉన్నారని చెప్పారు. సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్‌ 3న కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యారని రేవంత్ వ్యాఖ్యానించారు. మొత్తంగా బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌ల మ‌ధ్య సింగ‌రేణి కార్మికుల ఓటు బ్యాంకు కీల‌కంగా మారింది.

Tags:    

Similar News