పొలిటికల్ హీట్... ఒకే ప్రాంతంలో జగన్, పవన్, షర్మిల!
మరో కొన్ని గంటల్లో కూటమి మేనిఫెస్టో కూడా విడుదలవ్వనుండటంతో ప్రచార కార్యక్రమాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైపోయిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసిపోవడంతో.. అసలు సిసలు ప్రచార పర్వాలు తెరపైకి వస్తున్నాయి. పైగా ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో కూడా విడుదలవ్వడం.. మరో కొన్ని గంటల్లో కూటమి మేనిఫెస్టో కూడా విడుదలవ్వనుండటంతో ప్రచార కార్యక్రమాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఈ సమయంలో వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, షర్మిళ లు ఒకే ప్రాంతంలో ప్రచారాలతో హోరెత్తించేశారు!
అవును... ఏపీ రాజకీయాల్లో గోదావరి జిల్లాలు చాలా కీలకం అని చెబుతుంటారు. ఆ ప్రాంతాలు అధికారాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతుంటారు. పైగా అక్కడ ఓటర్ల మనోగతంపై ఒక అంచనాకు రావడం అంత ఈజీ కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో... సీఎం వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళా.. ముగ్గురూ ఒకేరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హోరెత్తించేశారు.
ఇందులో భాగంగా... సోమవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన పవన్ కల్యాణ్... అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గొల్లప్రోలు మండలం చందుర్తి కూడలి నుంచి వన్నెపూడి కూడలి వరకు ర్యాలీ సాగిన సమయంలో... ఓటర్లను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయని.. ఆ పార్టీ ఓటమి ఖాయంమని.. ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తెలిపారు!
ఇదే సమయంలో... ఏపీ కాంగ్రెస్ పార్టీ తరపున కాకినాడలో సభ నిర్వహిచారు ఆ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిళ. ఈ సందర్భంగా.. "టార్గెట్ జగన్" అనే సిరీస్ ని కంటిన్యూ చేశారు! వైఎస్సార్ ఆశయాలు నిలబెడతారనే ప్రజలు జగన్ కు ఓట్లేశారని చెప్పిన ఆమె... వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు పోలిక ఉందా? అని ప్రశ్నించారు.
మరోపక్క... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపేనని జగన్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 99 శాతం హామీలు అమలు చేశామని, జగన్ కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు.
ఇదే క్రమంలో మరింత డోసు పెంచిన జగన్... బాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుందని.. రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుందని.. బాబును నమ్మామంటే విష సర్పాన్ని నమ్మడమే అని తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇదే సమయంలో... పేదల్ని గెలిపించాలని జగన్ తపన పడుతున్నాడని చెప్పిన జగన్... ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకు మధ్య కాదని.. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని స్పష్టం చేశారు!
ఈ విధంగా... ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మూడు ప్రాంతాల్లో సీఎం జగన్, జనసేన అధ్యక్షుడు పవన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ బహిరంగ సభలు, ర్యాలీలు చేపడుతూ.. తమదైన ప్రసంగాలతో ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తూ హోరెత్తించేశారు.