అటు న‌లుగురు - ఇటు న‌లుగురు.. జంపింగుల ఫ్యూచ‌రేంటి..?

పార్టీ ఏదైనా.. ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత నాయ‌కులు అవకాశాన్ని, అవ‌స‌రాన్ని బ‌ట్టి త‌మ దారి తాము చూసుకుంటున్న ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి

Update: 2023-08-18 05:18 GMT

రాష్ట్రంలో జంపింగ్ జిలానీలకు కొద‌వ‌లేదు. పార్టీ ఏదైనా.. ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత నాయ‌కులు అవ కాశాన్ని, అవ‌స‌రాన్ని బ‌ట్టి త‌మ దారి తాము చూసుకుంటున్న ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా.. నాయ‌కులు జంప్ చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. అటు న‌లుగురు, ఇటు న‌లుగురు అన్న‌ట్టుగా వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైసీపీలోకి నాయ‌కులు మారారు.

వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరు ఖ‌చ్చితంగా పోటీకి కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు వీరు గెలుపుగుర్రం ఎక్కుతారా? అనేది ప్ర‌శ్న‌. ఎందు కంటే.. రాజ‌కీయ నేత‌లు పార్టీలు మారే స్వేచ్ఛ వారికి ఉన్న‌ట్టుగానే ఇలాంటి నాయ‌కులు మాకెందుకులే అనుకునే స్వేచ్ఛ ప్ర‌జ‌ల‌కు కూడా ఉంటుంది. ఇదే జ‌రిగితే.. నాయకులు దెబ్బ‌తిన‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

2019 ఎన్నిక‌ల్లోనూ ఇలానే జ‌రిగింది. సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. చంద్ర‌బాబు విజ‌న్ న‌చ్చి.. టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇలా వ‌చ్చిన అంద‌రికీ చంద్ర‌బాబు టికెట్లు ఇచ్చారు. అయితే, వారు ఆ ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయారు. ఒక్క అద్దంకిలో మాత్ర‌మే గొట్టిపాటి ర‌వి విజ‌యం ద‌క్కించుకున్నారు. మిగిలిన వారంతా అస‌లు అడ్ర‌స్ లేకుండా పోయారు. క‌నీసం ప్ర‌జ‌ల్లో సానుబూతిని కూడా సొంతం చేసుకోలేక పోయారు.

ఇదే ప‌రిస్థితి క‌నుక వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఉంటే.. ఇరు పార్టీల నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేల‌కు ఇబ్బందు లు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో జంప్ చేసిన నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల నుంచి సింప‌తీ ఉండ‌డం క‌ష్టంగా మారింది. అలా కాకుండా.. ఎన్నికష్టాలు ఎదురైనా నిల‌బ‌డుతున్న వారికి మాత్రం ప్ర‌జ‌లు గెలుపు గుర్రం ఎక్కిస్తున్నారు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మొత్తం 8 మంది జంపింగ్ నాయ‌కుల్లో ఎంత మంది గెలుస్తారో చూడాలి.

Tags:    

Similar News