ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే తొక్కి నారతీస్తా.. : పవన్ ఫైర్

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-01-10 12:17 GMT

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అధికారం అలంకారం కాదని, బాధ్యతగా భావిస్తామన్నారు. పదిహేనేళ్లు పాలించడానికి తాము గెలిచామని, అందుకు అధికారులు సహకరించాలని కోరారు. ఎవరైనా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే తొక్కి నార తీసేందుకు వెనుకాడేది లేదని తీవ్రస్వరంతో హెచ్చరించారు.

సంక్రాంతి సంబరాల కోసం సొంత నియోజకవర్గం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను చాలా గ్రాండ్ గా చేయాలని అనుకున్నామని, కానీ, తిరుపతి ఘటన కారణంగా అనుకున్నస్థాయిలో చేయలేకపోతున్నానని అన్నారు. తిరుపతి ఘటన తననెంతో బాధపెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్మించిన మినీ గోకులంను డీసీఎం ప్రారంభించారు. రూ.1.85 లక్షల వ్యయంతో నిర్మించిన గోకులంను రైతు యాతం నాగేశ్వరరావుకి అందజేశారు. ఆరు నెలల కాలంలో తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12,500 మినీ గోకులం షెడ్లను నిర్మించి రైతులకు ఇచ్చినట్లు చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం 260 షెడ్లను మాత్రమే నిర్మించినట్లు గుర్తు చేశారు. గతంలో అమూల్ తీసుకువచ్చి ప్రభుత్వ డెయిరీలను నిర్వీర్యం చేశారని పవన్ విమర్శించారు.

ప్రజా సేవ చేసేందుకు సినిమాలను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, పిఠాపురం ప్రజలు తనకు ఘన విజయమిచ్చిరన్నారు. జీవితాంతం రుణ పడివుంటానని చెప్పారు. కూటమి విజయమంటే ప్రజల గెలుపుగా అభివర్ణించారు. తరతో సహా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆరు నెలల హనీమూన్ పీరియడ్ ముగిసిందని, అంతా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అధికారులు కూడా తమ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అందరి సహకారంతో తమ పాలన 15 ఏళ్లు కొనసాగుతుందని అన్నారు. ప్రజలు తనను చూసి నమ్మి గెలిపించారని, ఒళ్లు వంచి పనిచేసిన తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతానని అన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎవరైనా ప్రయత్నిస్తే తొక్కి నారతీస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News