తెలంగాణలో గెలిచినోళ్లలో 50+ అంతమందా?
తాజాగా వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించినప్పుడు ఆసక్తికర అంశం ఒకటి కనిపించింది
తాజాగా వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించినప్పుడు ఆసక్తికర అంశం ఒకటి కనిపించింది. మొత్తం119 మంది గెలిచిన ఎమ్మెల్యేల్లో యాభై ఏళ్లకు పైబడిన వారి సంఖ్య ఏకంగా 97 మంది ఉండటం గమనార్హం. మొత్తం గెలిచిన వారిలో 30 ఏళ్లు.. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు కేవలం ముగ్గురు కాగా.. 31 నుంచి 40 మధ్యలో ఉన్న వారు కూడా ముగ్గురే. 40-49 మధ్యలోని వారు పదహారు మంది ఉండగా.. ఫిఫ్టీ ప్లస్ ఉన్న వారు మాత్రం మొత్తం సభ్యుల్లో 81 శాతం మంది ఉండటం గమనార్హం.
ఇక 60-69 మధ్యన 36 మంది ఉంటే.. 70 ఏళ్లకు పైబడిన వారు ఏడుగురు ఉన్నారు. తాజాగా వెల్లడైన ఎన్నికల్లో అత్యధిక పెద్ద వయస్కుడిగా స్పీకర్ గా వ్యవహరించిన. తాజా ఎన్నికల్లో గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయన వయసు 74 ఏళ్లుకాగా.. మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. ఆయన వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే.
అత్యంత పిన్న వయస్కులుగా రోహిత్ కు 26ఏళ్లు ఉంటే.. తర్వాతి స్థానంలో పాలకుర్తి నుంచి విజయం సాధించిన యశస్విని రెడ్డి ఉన్నారు. 70ఏళ్లకు పైబడిన ఏడుగురు ఎమ్మెల్యేల విషయానికి వస్తే.అత్యధికులు బీఆర్ఎస్ కు చెందిన వారే కావటం విశేషం. ఆ ఏడుగురు ఎవరంటే..
పేరు వయసు పార్టీ నియోజకవర్గం
పోచారం శ్రీనివాసరెడ్డి 74 బీఆర్ఎస్ బాన్సువాడ
సుదర్శన్ రెడ్డి 73 కాంగ్రెస్ బోధన్
కడియం శ్రీహరి 73 బీఆర్ఎస్ స్టేషన్ ఘన్ పూర్
రేవూరి ప్రకాశ్ రెడ్డి 71 కాంగ్రెస్ పరకాల
తుమ్మల నాగేశ్వరరావు 71 కాంగ్రెస్ ఖమ్మం
మల్లారెడ్డి 70 బీఆర్ఎస్ మేడ్చల్
ముఠా గోపాల్ 70 బీఆర్ఎస్ ముషీరాబాద్
ఇదిలా ఉంటే అత్యంత పిన్న వయస్కుల విషయానికి వస్తే 30 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు మొత్తం ముగ్గరు మాత్రమే. వారిలో మైనంపల్లి రోహిత్ రావు 26 ఏళ్లు (మెదక్) కాగా.. పాలకుర్తి నుంచి బరిలో ఉన్న యశస్విని రెడ్డి కూడా 26 ఏళ్లే. ఇక.. నారాయణపేట నుంచి ఎన్నికైన పర్నికారెడ్డి 30 ఏళ్లు. ఈసారి సభలో డాక్టర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానంలో ఇంజనీరింగ్ చేసిన వారు ఉండగా.. తర్వాతి స్థానంలో లా చదివిన ఎమ్మెల్యేలున్నారు. ఈసారి సభలో లా పూర్తి చేసిన వారు నలుగురు ఉన్నారు. విదేశాల్లో చదువుకున్న వారిలో ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మదన్ మోహన్.. నాగార్జునసాగర్ నుంచి గెలిచిన కుందూరు జై వీర్.. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్.. పరిగి నుంచి విజయం సాధించిన రామ్మోహన్ లు ఫారిన్ లో చదువుకున్న వారు కావటం గమనార్హం.